శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం
పౌర్ణమి నగదు బహుమతుల కవితల పోటీ
భాద్రపద మాసం
నిర్వహణ
శ్రీమతి లలితా కృష్ణ
కవనజ్యోతి సమూహం
********************"***********
కీర్తిశేషులు కేశరాజు వరవరరావు నీలాదేవి
స్వాతంత్ర్య సమర యోధుడు, తామ్రపత్ర గ్రహీత,పాతర్లపాడు ఖమ్మం.
వారి జ్ఞాపకార్థం
శ్రీ కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు నిర్వహిస్తున్న కవితా స్రవంతి
@@@@@@@@@@@@@@@@@@@@@
కవి వరుల జాబితా
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
1.పిళ్ళా వెంకట రమణమూర్తి గారు
2. చంద్రమౌళి గారు
3.కోరాడ నరసింహా రావు గారు
4.ఆళ్ల నాగేశ్వరరావు గారు
5.నెల్లూరు వేంకట లక్ష్మి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా గారు
6. పిన్నక గేశ్వరరావు గారు
7 .సూర్యనారాయణ గారు
8. మండ నాగేశ్వరరావు గారు
9.సింహాద్రి వాణి గారు
10.తోట సులోచన గారు
11. డా.వేమూరి.సత్యవతి. విజయవాడ గారు
12.కొలకలూరి దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు
13.అపరాజిత్ రెడ్డి గారు
14.కాసుల ధీరాజ శర్మ, గారు
15.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావుSAsocial గారు
16.కూని అంకబాబు గారు
17. డా.భమిడిమఱ్ఱి కమలాదేవి గారు
18.కొంజేటి రాధిక గారు
19.ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు
20.వాణిసరోజిని లక్కరాజు గారు
21. డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
22.ఏడెల్లి రాములు గారు
23.లలితా చండి గారు
24.దోసపాటి వేంకటరామచంద్రరావు గారు
25. డా.దారల విజయ కుమారి గారు
26. కవిత వెంకటేశ్వర్లు గారు
27.ఆళ్ల నాగేశ్వరరావు( కమల శ్రీ) గారు
28.మద్ది. పుల్లారావు గారు
********†************₹
1
*కవితా గానం సీజన్ 6*
*బాద్రపద పౌర్ణమి* కవితల పోటీ నిమిత్తం వ్రాసిన కవిత
తేదీ: *08-09-2025*
అంశం: *ఐచ్ఛికాంశం*
రచన: *పిళ్ళా వెంకట రమణమూర్తి*
****************************
శీర్షిక: *సర్దుకోడానికి ఏముంది?*
తానై సృజించిన సృష్టి
తానై మెదిపి వెలిగించిన దీప్తి!
కోరని వరాన్ని అమ్మ కొంగున కట్టి
ఉమ్మనీటిన ఓలలాడించిన వైచిత్రి!
చిటికెడు ఊపిరి పొదిగి
హాంఫట్లా భువిని పడేసిన మోళి!
పుట్టుకనుంచి పుడకల చితి వరకూ..
"నీవే తప్ప నిత:పరంబెరుగని"
వెర్రి మాలోకం ఈ ప్రాణి..
నీదనే బలుపులో
అప్పుడ ప్పుడైనా చూపుతిప్పి..
చిటికెన వేలు అందించి
సాంత్వన నా కివ్వడం
నీ అవతార పరమార్ధం!
కాలం కొళాయి కింద రంగుల కాన్వాస్ మనగలదా?
కొట్టుకుపోయిన ఇంద్ర ధనువుల రంగులు పోగా...
ఇక్కడ...మనసు మౌన మవగా
మిగిలింది...తెల్లముఖం!
బతుకింతే ఇక బయల్దేరమనే
నీ పేర శ్రీముఖం!!
ఇహ! సర్దుకో డానికి ఏముంది
నువ్విచ్చిన నవ్వా..ఏడుపా..
మిగిలింది ఈ కట్టె....
ఆలస్యం ఎందుకూ
అగ్నికి ఆహూతి చేసేయ్...
ఆ ఒక్క... క్షణం చాలు
బూడిదై పోయి
నీకు అభిషేకమై తరిస్తా!
*****************************
*హామీ పత్రం*
పైన పోస్ట్ చేసిన కవిత నా ఆలోచనా స్రవంతిలో
జాలువారిన కవితయే అని హామీ ఇచ్చుచున్నాను.
2
ప్రాణమున్నజనుల ప్రతిగుండెనుకూడ
బాధలుండితీరు గాధగాను!
నొకరునవ్వుచాటు నొకరుకన్నీటను
దాచిపెట్టుచుండు ధరణియందు!!
---------------------------------చంద్రమౌళి✍️
ప్రాణమున్నజనుల ప్రతిగుండెనుకూడ
బాధలుండితీరు గాధగాను!
నొకరునవ్వుచాటు నొకరుకన్నీటను
దాచిపెట్టుచుండు ధరణియందు!!
---------------------------------చంద్రమౌళి✍️
3
బాగు బాగు💐🌷💐🌷🙏👌👍✌️
హృదయ స్పందనలు
అది బాధైనా ఆనంద మైన....
మౌనంగా వ్యక్త పరచేది కన్నీరే...!
యే కన్నీరెన కాల ఏముందో... అన్నాడో మనసు కవిగా ఖ్యాతి గడించిన సినీ కవి... !
అది క ష్ఠ మై నా, సుఖమైన నవ్వుతు బత కాలి రా తమ్ముడు నవ్వు తూ చావాలిర అన్నా డు మరో సినీ కవి....
యే మా ట కామా టే చెప్పు కో వాలి....
సినిమా ఓ జీవితానికి సరిపడ సత్యాలన్నీ చెప్పేసింది కదూ...!
సినిమా ఈస్గ్రేట్..!!
************
.. కోరాడ నరసింహా రావు !
4
సందర్భం; సెప్టెంబర్....8....
ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం.
శీర్షిక :
" అక్షర భారతాన్ని నిర్మిద్దాం""
ముక్కంటికీ మూడోనేత్రంలా
వృక్షానికి వేరుల్లా
జగతికి ఉదయంలా
జనులకు హృదయంలా
మనిషికి అక్షరం అలా!
ముక్కంటి.మూడో నేత్రం తెరిస్తే
దుష్టశిక్షణ, శిష్ట రక్షణ జరుగును
మనిషి అక్షరం నేర్చితే
అజ్ఞానం తొలిగి విజ్ఞానం సమకూరును!
కులాల కుళ్లు
మతాల ముళ్ళు
ఆర్ధిక అసమానతల సంకెళ్ళు తెంచుకుని
కులాలకు మారుగా కరుణను
మతాలకు బదులు మానవతను
అసమానతలకు మారుగా సమానతను ఎంచుకుని
నైతికతను పెంచుకుని
మంచి మనిషిగా మారి
సామాజిక రుగ్మతలపై అక్షరాయుధాలను సంధించి
సామాజిక చైతన్యాన్ని సాధించి
సమ సమాజ సాధనా దిశగా పయనం సాగిస్తూ
అక్షర భారతాన్ని నిర్మించాలి
అక్షరాయుధాన్ని బ్రహ్మాస్త్రంగా
మలుచుకోవాలి!
...........................................
రచన;
ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి
గుంటూరు...జిల్లా
ఆంధ్రప్రదేశ్....రాష్ట్రం
చరవాని సంఖ్య;7416638823
...........................................
పై వచనకవిత నా స్వీయారచనేనని హామీఇస్తున్నాను.
5
కవితా గానం 6
పౌర్ణమి కవితల పోటీ
నెల్లూరు వేంకట లక్ష్మి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా
8/9/25
శీర్షిక: మృత్యు శకటం
************************
అతనెవరో తెలీదు
నే నడిచే దారిలో
నా అడగులో అడుగేశేవాడు
చూపుల బాణం విసిరేవాడు
అరచేతి లోని పొత్తాన్ని
అడ్డుగోడగా మలిచి
చూపులను మాత్రం
అతనెళ్ళిన దారిన
ఆత్రం గా పరిచేదాన్ని
అతనొదిలిన వెన్నెల నువ్వులు
తప్ప అతడక్కడ లేడు
మౌనంగా రోజులు దొర్లుతుంటే
క్రమేపి అతని రాకకై
పొగడ్తల పగడాలకై
నవ్వుల ముత్యాలకై
పడిగాపుల పరదాలతో
వేచి చూడటం పరిపాటైంది
విధికి ఏమైందో కానీ
ఓ నిశిలో శశిలా
విచ్చేసిన అతను
దారి తెలియని
మృత్యు శకటంలా
కన్న కలల్ని పేకమేడలా కూల్చి
కనుమరుగై పోయాడు
మది సంద్రం లోని
దుఃఖపు అలలుఎగసిపడి
నయనాలను ముంచేశాయి
ఇప్పుడక్కడ మోడువారిన
ప్రేమాంకురం తప్ప ఏమీ కనిపించదు
ఈ కవిత నా స్వంతం ఇది దేనికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను
6
పద్య సంఖ్య :-- 2107. 7--9--2025.
పిన్నక నాగేశ్వరరావు. స.క.స.1043.
హైదరాబాద్.
శంకరాభరణం వారు ఇచ్చిన సమస్య :--
ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా.
పూరణము :-- కందపద్యము.
మాన్యులు పాల్గొను సభలో
నన్యులకున్ చోటులేదటంచు తెలియగా
దైన్యమున వెడలె, నప్రా
ధాన్యంబున్నట్టి తావుఁ దడయక విడుమా!
**************************************
7
కవితా గానం..6
పౌర్ణిమ కవితల పోటీకీ...
జి.సూర్యనారాయణ,
అవనిగడ్డ, కృష్ణాజిల్లా
చరవాణి:6281725659.
అంశం : ఐచ్ఛికం
శీర్షిక : *ఎలుక వాహనమెక్కి... సిద్ధి కైలాసానికి...!*
వెళ్లి పోతున్నావా.. బుద్ధి వినాయకా
ఎలుక వాహనమెక్కి.. సిద్ధి కైలాసానికి
నీ భక్త కోటికి వీడ్కోలు పలికి...
ఏడాదికి మళ్లీ వస్తావా... ఏకదంతా...?
చలువ పందిరిలో మీకు పద్మాసనాలు వేయించి
పత్రి పూజలను చేశాం పరమ పవిత్రంగా
ఉండ్రాలను తినిపించాం ఉల్లాసంగా...!
అక్షరాలను దిద్దించాం
బడిఈడు పిల్లలతో
సత్కారాలు చేశాం ప్రతిభామూర్తులకు
మీకు బోలెడు దండాలు పెట్టాం.. మా గండాలను తొలగించమని మీ తొండముతో...!
తొమ్మిది రోజులు కమ్మని ప్రసాదాలు తిని
భజనలు చేశాం మీకు... మా ఇంటిల్లిపాది భోజనాలు మాని...!
హరికథలను విరివిగా చెప్పించాం
పండిత పామర జనులకు
అష్టాదశ పురాణాల చరిత్రలను
వెదజల్లినాము పరిమళాలు లాగ...!
పదవ రోజున మీకు ప్రత్యేక పూజలు చేసి...
పురవీథులలో ఊరేగించాం మేళ తాళాలతో వేడుకగా
హారతులందుకున్న మీ మట్టి విగ్రహాలను...
నిమజ్జనాలు చేసినాము సజ్జలాలలో విఘ్నేశ్వరా...!
మూడు కాలాలలో...
చల్లగా మమ్ము కాపాడుము లంబోదరా
ఎల్లవేళలా మిమ్ము కొలుస్తాము
కుమార స్వామి సోదరా....!
*జి.సూర్యనారాయణ,6281725659.*
ఆర్యా...
సదరు కవిత నా సొంతం. దేనికీ అనువాదంలేదు.అనుకరణ కాదు. మీ పోటీకి మాత్రమే ప్రత్యేకంగా రాశానని హామీ యిస్తున్నాను.
8
కవితాగానం సీజన్ 6
భాద్రపదమాస పౌర్ణిమ కవితలపోటీకి.
అంశం:ఐశ్చికం
శీర్షిక: మనోదర్పణం
రచన: మండ.నాగేశ్వర్రావు.
పెందుర్తి, సరిపల్లి.
మనోదర్పణం!!!
============
అద్దం నిజం చెబుతుంది..!!
అద్దం నిజమే చెబుతుంది ..!!
కానీ విచిత్రం, ఇక్కడ అద్దం అంతరంగాన్ని చూపిస్తోంది..
నాలోని అంతర్ముఖాన్ని కనిపెట్టింది!!
ఆ పూటకి లేకపోయినా...
ఆకలికి తాళలేకపోయినా....
అవహేళనల జనానికి నిజాన్ని
అద్దమై చూపించాలనీ....
నా కలల్ని కనిపెట్టి కల్మషంలేకుండా నా మనసునీ,
మనసులోని కలల్నీ కనిపెట్టి
కళ్ళకుకట్టి , నా మనసుని మెలిపెట్టి
అద్దంలో ప్రతిబింబిస్తోంది!!
అది నా మనోదర్పణమా!?
ఏమో అయుండొచ్చు....
ఈమాయాప్రపంచంలో కానిదేముందనీ...???
దర్పణం ముందు నా నిజరూపానికి
కోటిఆశల కలలన్నీ కలగలిపి
ఆత్మవిశ్వాశాన్ని ఊపిరిగా చేసుకుని....అచంచల ధృక్పధాన్ని ధైర్యంతో జోడించి ముందుకురికితే....
దర్పణంలో ప్రతిబింబం నాదేకదా!!!
కలల్నికంటే సరిపోదు..!
కలనిజమవ్వాలని పెడుతుండాలి
శతపోరు!!
అద్దంలో నారూపం అవదా తారమారు!!??
లిఖించి చూపలేనా ఈప్రపంచానికి
మరోమారు...!??
---------మండ.నాగేశ్వర్రావు.
7793939724.
9
కవితా గానం స జూన్:--6
భాద్రపద మాసం పౌర్ణమి కవితల పోటీకి
అంశం:-- ఐచ్ఛికం
శీర్షిక :-- రెక్కలొచ్చిన మనసు
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ.
వాస్తవ ప్రపంచం చీకటి వెలుగుల కష్టసుఖాల మిశ్రమం.
అనుకున్నామని అన్నీ జరగవు. అనుకోలేదని జరిగేవి ఆగవు.
కానీ, మనసు రెక్కలు విప్పుకొని ఎగిరే ఊహాలోకంలో కష్టాలు కన్నీళ్ళు నిరాశా నిస్పృహ లుండవు.
వుండే వన్నీ ఆకుపచ్చ వసంతాలే. సుమసోయగాల పరిమళాలే.
వెన్నెల చల్లదనాలు, ఆనంద జలపాతాలే.
మనసుకు రెక్కలువచ్చి, స్వేచ్ఛా విహంగమై విహారం చేస్తుంది గగనంలో, భూమిపై అడ్డూ అదుపూ లేకుండా.
ఊహాలోకంలో హిమాలయంపై ఇంద్రభవనంలో హాయిగా నిద్రిస్తుంది.
జనసంచారం లేని ఇసుక ఎడారిలో నందనవనాన్ని సృష్టిస్తుంది.
ఉన్నదిలేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా తనకనుకూలంగా ఊహించుకొని, ఆనంద తరంగాలపై హాయిగా ఉయ్యాలలూగుతుంది మనసు.
విభేదాలు, వివాదాలు,ఎల్లలు, ఏలికలు, బరువు బాధ్యతలు ఉండని ఒక స్వతంత్ర రాజ్యంలోకి ఎగిరిపోతుంది రెక్కలొచ్చిన మనసు.
ప్రయాణంలో ఆటంకాలు ఉండవు. రోడ్డు ప్రమాదాలుం డవు, ఖర్చులుండవు, కష్టాలుండవు.
ఎవరికైనా అందమైనదీ, ఆనందమైనదీ, ఆంక్షలు లేనిదీ రెక్కలొచ్చిన మనసు ఎగిరి వెళ్ళే ఆ ఊహాలోకం.
కష్టపడుతూ అందమైన ఊహాలోకాన్ని సృష్టించుకోవచ్చు. నెరవేర్చుకోవచ్చు.
కానీ, ఊహల్లోవిహరిస్తూ, సోమరిపోతై గాలి మేడలు కడుతూ, యదార్థాన్ని విస్మరిస్తే జీవితం తోక తెగిన గాలిపటం, తాడులేని బొంగర మౌతుంది.
తస్మాత్, జాగ్రత్త.
హామీ:--ఇది నా స్వీయ రచన.
10
కవితా గానం సీజన్-6
భాద్రపద మాస పౌర్ణమి కవితల పోటీ
తేది 8-9-2025
తోట సులోచన
నెల్లూరు
అంశం ఐచ్చికం
శీర్షిక కఠిన శిలలు
దోచుకోవడం, దాచుకోవడమే మనిషి జన్మకు పరమార్ధమా?
తర, తరాలకు సరిపడ సంపదను పోగేసి
న్యాయాన్ని, ధర్మాన్ని పాదాల క్రింద తొక్కేసి
పైకి పెదవులపై చిరునవ్వులు నటిస్తూ
నీతులు వల్లిస్తూ, లోపల విషపు తలపులతో
జీవించడమేనా
భయంకర ప్రసవ నరక వేదన భరించి
చక్కని శిశువుకు జన్మ నిచ్చివేదనంతా మరచి
తన పయోనిధితో పాలుబట్టి
తన రక్తమాంసలను ధారబోసి
అనురాగ యొడిలో లాలించి, పాలించి
మమతల వంతెనపై పెద్ద జేసి
ఆరడుగుల మనిషిలా నిలబెట్టినారుగా
కన్నవారి పోషణలో మనిషిగా మారి
సంపాదనా పరుడివైతే, తల్లిదండ్రులను మరచి
శిలగా మారిన గుండెతో రాతి మనిషిలా
జీవిస్తూ
బంధాలను,అనుబంధాలను తుంగలో తొక్కేసి
కన్ను మిన్ను గానక కన్నతల్లి గుండెలో గునపాలు
దింపితే
మాతృమూర్తి విలవిల లాడుతూ, రోదిస్తుంటే
నిత్యం కన్నీరు జీవనదిలా ప్రవహిస్తుంటే
ఆ తల్లి అశ్రువుల ధాటికి కఠిన శిలలైనా
కరుగుతాయేమో
కానీ నీ కసాయి గుండె కరగదుగా
కన్నవారి ఆశీస్సులతో పిల్లలు గొప్పవారవుతారు
అది గ్రహించి, తల్లి దండ్రుల నికనైనా
అక్కున చేర్చుకుని మనిషిగా మారితే నీకు పుట్టగతులుంటాయి
లేకుంటే నీ కర్మకు నీవే బాధ్యుడవు, తెలుసుకో
ఈ కవిత నా స్వంతమని హామీ
11
కవితా గానం.
భాద్రపద పౌర్ణమి కవిత ల పోటీకి..
శీర్షిక.. సీ "రియల్"
అసూయకి అందలాలు..ద్వేషానికి ఆకరాలు..
పంతాలకి పరాకాష్ట ..వెరసిమన "టీవీ సీరియల్స్",!
హీరో వెతుకుతూ కుడివైపుకి...హీరోయిన్ పోతుంది ఎడమవైపుకి!
నరాలుతెగుతున్న ఉత్కంఠ చూసే వాళ్ళకి!
కడుపులో పాపాయికి విషం,సొంత చెల్లెలికి మత్తుమందు..
కన్నతల్లి కంట్లో కారం...బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ లు..
వంటింట్లో విషపు బాటిల్స్..ఇవీ మన టీవీ సీరియల్స్!
ఒక భర్తకు ఇద్దరు భార్యలు,మాజీ ప్రియురాలో, ప్రియుడో...
అసంబద్ధ కథలు, అర్థం లేని వ్యథలు..
పెళ్లయిన జంటని విడగొట్టడం.,
ఆస్తి కోసం ఎడతెగని కుట్రలు..
తాగుడు, కిడ్నాపింగ్లు, రౌడీయిజాలు..
కట్టలు కట్టలుగా ఆడవిలన్లు..
చిటికెస్తే అరడజను గుండాలు..
వికటాట్టహసాల్లేని వంకర నవ్వులు!
జైలు,బెయిలు,కోర్టు సీన్లు తప్పనిసరే!
పసివాళ్ళ చేత ముదురు మాటలు..
జుగుప్స తెచ్చే పరమ చెత్త సీరియల్స్,
వందల ఎపిసోడ్లు రబ్బర్ లాసాగుతూ..
తెలుగు వాళ్ళ సహన శక్తిని పరీక్షిస్తూ..
మన సృజన శక్తిని వెక్కిరిస్తూ....
ప్రగతి నిరోధకమైన దరిద్రపుకథలు మాకొద్దని నిరసిద్దాం! వస్తారా?
సీ "రియల్" అందామా మరి?
ఈ కవిత నా స్వంత రచన!
డా.వేమూరి.సత్యవతి. విజయవాడ
9885136308. ఎన్.టి.ఆర్.జిల్లా.
12
కవితా గానం సీజన్ 6నగదుబహుమతులపోటీకి
అంశం: సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయుడు
శీర్షిక: మార్గదర్శి
రచన: కొలకలూరి దేవికారాణి రత్నాకర్ తెనాలి
----------------------------------------
ముళ్ళకంచెలో ఇరుక్కున్న చక్కటి చీరెను
తప్పించే మెళుకువ ఉపాధ్యాయుడు
చిమ్మ చీకటి కమ్ముకొచ్చే దారులలో
వేగుచుక్క వెలుగు ఉపాధ్యాయుడు
అర్థం కాని విషయాలకి ఆకళింపు ద్వారాలు
తెరిచే మనోవికాసం ఉపాధ్యాయుడు
భాషలపై మమకారం అధికారం పెంచే
మాతృమూర్తి పితృ సమానుడు ఉపాధ్యాయుడు
శాస్త్ర సాంకేతిక గణిత సామాజిక విలువలకు
నైతిక కౌటుంబిక వ్యక్తిగత సామూహిక విలువలకు
తొడిగిన చలువ జిలుగుల మూర్తిమత్వవలువలు ఉపాధ్యాయుడు
దుమారంలా చెలరేగిన పరభాషా వ్యామోహం
తరిగిపోతున్న గురుశిష్య సంబంధాలలో
కరిగి కర్పూరమవుతున్న బోధనా దీపకళిక ఉపాధ్యాయుడు
అంధకార బంధురమై లోపభూయిష్టమైన సమాజానికి
అభ్యుదయం,పురోగమనాల ఆర్థిక సూత్రం
ఉపాధ్యాయుడు
ప్రేమ ఆప్యాయతల గొడుగు పట్టి
వర్షపు చినుకుల లాంటి విద్యా బోధనతో
విజ్ఞాన క్షేత్రాల పీయూషాలను పండించే
కృషీవలుడు ఉపాధ్యాయుడు
విద్యార్థి భవితవ్యమే ఊపిరిగా
స్వార్థాన్ని త్యజించి తీవ్రమైన వ్యతిరేకతల నడుమ
కంఠాన్ని యంత్రం గా మార్చి హర్షాతిరేకంతో బోధిస్తూ
దిక్కుతోచని సముద్ర ప్రయాణంలో
దిక్సూచిలా సమాజ పురోగతికి మార్గదర్శి ఔతాడు
హామీ పత్రం: మార్గదర్శి అనే ఈ కవిత నాచే రచింపబడినది ఎవరికి అనుసరణ కానీ అనుకరణ కానీ కాపీ కానీ అనువాదం కానీ కాదు అని హామీ ఇస్తున్నాను
కే దేవికారాణి రత్నాకర్ తెనాలి.
13
శీర్షిక :పుష్పించిన పద్మం జీవనరాగం,,,,,,!!
పేరు అపరాజిత్ రెడ్డి
ఊరు సూర్యాపేట
ఫోన్ నంబర్ 9848532031
ప్రియతమా నా కలల పూదోటలో విరిసిన జాబిలి కలువవు
నా మనస్సు పూసిన మార్దవ మృదు మరుమల్లియవు
లోలోన రగులుతున్న నీ కోసం తపియించే నివురు గప్పిన నిప్పు నా హృదయం
నా హృదయం నీ ప్రేమ ఊసుల కోసం నిరంతరం గుబులు రాగాల సంకేతాలను ఎలా తెలిపేది,,,,,,,,
నా విరహవేదనలో నీ మోము మర్మగర్భిత జాబిలియై నా జాలి గుండెలో నీ పెదవులు పలికే సున్నిత రాగం కోయిల గీతం,,,,,,,,
అలుపెరుగని జీవిత పయనంలో నీవు సూచించిన దారి పొడవునా నీ అడుగుల సవ్వడులే వినిపిస్తున్నాయి నీవు రాని నిదురపొద్దు ఎలా గడిపేది,,,,,,,,,,,
బ్రతుకు నిండా పున్నమలే అనుకున్నా అమావాస్యలు కూడా ఉంటాయని మరిచా జాముపొద్దు ఉన్నదాకా వేచి వేచి వేగి వేగి ,,,,,,,,,,
నీ తలుపుల ఆలాపణలు అంకుశపోట్లయి గుచ్చుకుంటూ నిదురలేని నీరవ నిశిరాత్రి కన్నులు అర్దనిమిలితాలై కన్నీటికి కాటుక కరిగిపోతూ కమిలిపోతున్న మోము,,,,,,,,,,,
హృదయ సంవేదనల్లో నీవు సుకుమారంగా సన్నని గీతలలో చిత్రీకరించిన నా మోము కన్నె గులాబీ అన్న పలుకులు పండు వెన్నెలలు రాగాల సంపెంగలు,,,,,,,,,,,,
ఉరిమే మేఘాలు మెరుపుల అలజడులు నా హృదయం భారంగా నీ కోసం భాష కరువైన విషాద లోగిలిలో నేనొక్కరినే నీ రాకకై తపియించే వెర్రిని,,,,,,,,,,,
అనంత ఆకాశమంతా వెతుకుతున్నా ఆ చుక్కల్లో ఏ చుక్కనీవని వినిపించే ప్రతిధ్వని నా కర్ణభేరిపై దండోరా వేస్తోంది నీవు అచంచల దీక్షలో ఉన్నావని,,,,,,,,,,,
ఈ చల్లని చిరు చిరు చినుకుల్లో నీ సుమధురమైన గానం వీణులవిందుగా సాగిపోయే మోహణమురళీ రవం పుష్పించిన తామరపుష్పమై తెల్లవారింది,,,,,,,,,
ఆనందాల హరివిల్లు మధ్యకు వంచి విరిచిన రాముడు దేవుడు చిత్రీకరించిన నీవు రాజా రవివర్మవు ఇది నిజం,,,,,,,,,,,
అపరాజిత్
హామీపత్రం ఈ కవిత నా కలం సేత అని నా హామీ
14
కవితా గానం. సీజన్ 6!!
భాద్రపద మాస పౌర్ణమి
నగదు బహుమతుల
కవితల పోటీ!!
అంశం : ఆత్మ విశ్వాసం!!
శీర్షిక : విశ్వసనీయతను గెలిపించు!!
సంపూర్ణ విశ్వాసంతో
సకల కార్యములు తలపెట్టు!
సంపూర్ణ నమ్మకంతో
సకల పనులకు శ్రీకారం చేపట్టు!!
ప్రగాఢ విశ్వాసంతో
ప్రతిభా నైపుణ్యములు కనిపెట్టు!
పరిపూర్ణ నమ్మకంతో
ప్రతి పని లోను పరాకును వదిలిపెట్టు!!
ఆత్మ విశ్వాసంతో అనన్య నమ్మకంతో
అడుగులు వేసిన శుభారంభమే తొలిమెట్టు!
అచంచల సంకల్పంతో సదాశయచిత్తంతో
అలుపెరుగని పోరాటపటిమయే అసలుపట్టు!!
అలనాటి నుండి నేటి వరకు
ఆత్మవిశ్వాసంతో అలరారినారు ఎందరో!
నేటి నుండి రేపటి వరకే
ఆత్మస్థైర్యంతో ఆరంభించెదరు విజ్ఞులెందరో!!
మాపటి నుండి జీవితాంతము వరకు మనో నిబ్బరంతో మహత్కార్యములు
చేసి చూపించెదరు మహనీయులెందరో!!!
మరెందుకు ఆలస్యం
సమయం మించి పోవును కాలయాపనలో!
మరుక్షణమే కాదు కాదు తక్షణమే
జాగరూకతతో మేల్కొనుము!!
నీలోన నిద్రాణమై యున్న స్వశక్తిని
వెతికి వెలిగించి రగిలించి ప్రజ్వలింప జేయు!!
ఎన్నుకున్న లక్ష్యాన్ని మరువ వద్దు!
నమ్ముకున్న జీవితాలను నట్టేట ముంచొద్దు!!
ఆత్మ విశ్వాసమే పరమాత్మగ భావించు!
అనుక్షణం అంతరంగాన్ని పరిశోధించు!!
సత్య శోధన వైపు దృష్టిని మరలించు!
సశాస్త్రీయ సంప్రదాయాలను పాటించు!!
శాస్త్ర సాంకేతికత
విజ్ఞానమును జోడించు!
అవరోధాలెన్ని వచ్చినను వాటినధిగమించు!!
సాధించలేనిదుండదని సైనికుడవైనిరూపించు!!
మానవీయ విలువలతో
మనీషివై జీవించు!!
ఆత్మవిశ్వాసంతో బ్రతుకుచు, వినయ విధేయుడవై విశ్వసనీయతను గెలిపించు!!!
కవి పేరు : కాసుల ధీరాజ శర్మ,
విశ్రాంత అకౌంట్స్ ఆఫీసర్
ఊరు. : తూప్రాన్, మెదక్ జిల్లా,
9450522864.
హామీ పత్రం!!
పై వచన రచన నా స్వీయ రచనయే దేనికీ
అనుకరణ గాని అనువాదము గాని కాదని
దృవీకరించుచున్నాను.
కాసుల ధీరాజ శర్మ.
15
కవితాగానం
భాద్రమాస పౌర్ణమి కవితల పోటీ
శీర్షిక: వరుణుని కోపము
వరుణునికోపము తాండవించె
ప్రభంజనములా ప్రజ్వరిల్లె
కామారెడ్డి నగరం తల్లడిల్లె
కృంభవృష్టిని కురిపించె
వాగులువంకలు పొంగిపొర్లె
రహదారువెంట వరదలు పారె
జనం కళ్ళలో కన్నీరు కారె
జోరువానలు జోరుగా కురిసె
చెరువుల అలుగులు పారె
ఉధృతప్రవాహానికి వాహనాలు
కొట్టుకుపోయె
ఊరువాడనగరమంతా జలమయమయ్యె
జనులు ప్రాణ భీతితో తల్లడియ్యె
పంటలుపండే భూములో మేటలువేసె
ఆరుగాలము పండించే రైతన్న
గుండాగె
భూమాత గుండెలో చిల్లులు పడెనె
నింగినేల ఒకటిగా కలసిపోయి పగతీర్చుకొనె
జలప్రళయం విలయతాండవం చేసె
వాన ఉధృతప్రవాహం మరణ శాసనం రాసె
ఎన్నో పేగుబందాలు ఆర్తనాదాలు చేసే
ఆకలికేకలతో రోదనల వేదనలతో ప్రతిధ్వనించె
రచన
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావుSAsocial
Zphs కొండాపూర్
కామారెడ్డి
16
కవితా గానం సీజన్ 6
భాద్రపదమాసం పౌర్ణమి కవితల పోటీకి
శీర్షిక: నీ ఆయువు
ఓయీ పురుషోత్తమా
ఇది ఎరుగుదువా
ఆమె కేవలం ఆమె కాదు
నీ ఆయువు
ఆమె మెడ సోకును
కళ్ళప్పగించి చూసే ముందు
నీ శైశవాన నీవు ఆదమరిచి
జోగిన చోటదని తెలుసుకో
ఆమె అధరాలు
శృంగారానికి సోపానాలనుకుంటున్నావేమో
కాదు కాదు అవి నిన్ను ముద్దు చేసి
లాలించిన మధుర వేదికలు
ఆమె నున్నని చెంపల తాకిడికి తొందరపడక
నులివెచ్చని నీ బాల్యానికి
తోడైన స్థావరాలని గ్రహించు
ఆమె స్తనద్వయాన్ని
సరసానికి ప్రతీకనుకున్నావా
కాదు కాదు బోసి నవ్వుల పాపడివైన
నీకు కడుపు నింపిన సుధాభాండాలవి
ఆమె కటి వంపు చూసి
నీ దృష్టి శృతి తప్పుట తప్పు
ఎందుకంటే బుడతడిగా ఉన్న నీకు సుఖాసనమై
నిన్ను చేరదీసిన చోటది
ఆమె కరకమలములు చూసి
ఏమనుకుంటున్నావేమో
నీకు బుడిబుడి నడకలు నేర్పిన స్వరములవి
ఆమె నాజూకు కాళ్ళను చూసి
వెర్రిత్తిపోకు సుమీ
ఆమె చేత నీవు లాల పోయించుకున్న
ఆత్మీయ స్నానఘట్టాలవి
విశాలమైన ఆమె వీపు చూసి
అశ్లీల ప్రకోపాలకు లొంగిపోకు
నువ్వు ఊరేగిన నీ చిన్ననాటి అంబారి అది
కాదది ఆమె మర్మ స్థానం
నువ్వు పురుడు పోసుకున్న కార్యక్షేత్రం
నీకు రుధిరాభిషేకంతో
ప్రపంచాన్ని పరిచయం చేసిన
ఈ లోకపు ముఖ ద్వారం అని మరువకు
అందుకే
ఓయీ పురుషోత్తమా
నీవు పశువుగా మారి ఆమెను కసువుగా చూడకు
ఆమే నీ ఆయువు
హామీ పత్రం : ' నీ ఆయువు' అనే ఈ కవిత నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను.
కవి : కూని అంకబాబు
ఊరు : నెల్లూరు
చరవాణి : 9640637991
17
కవితాగానం సీజన్ 6
భాద్రపద పౌర్ణమి కవితల పోటీకి నాకవిత
పేరు : డా.భమిడిమఱ్ఱి
కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
తేది : 8-9-25
అంశం : ఐచ్ఛికం
శీర్షిక : అమావాస్య చంద్రుడు
అనుభవైక వేద్యమే అందరికి
పున్నమి చంద్రుని వెన్నెలలు.
సువిదితమే మనలకు రాకాచంద్రుని వెలుగుల ప్రోవులు .
కానరాడు ఎవరి కంటికి అమావాస్య చంద్రుడు.
తప్పవు కాల గమనంలో
పౌర్ణమి అమావాస్యలు.
నివాసము ఆగగనవీథిలోనే
కంటికి కానరాకపోయినా
నిర్వర్తిస్తూనే ఉంటాడు తనవిధులను కంటికి కానరాకున్నా
శీతలకిరణుడే, అమృత కిరణుడే ఆరోగ్యప్రదాతే
అందిస్తూనే ఉంటాడు తన సేవలను జనావళికి
కానవస్తారు ఎందరో ఇటువంటి
అమావాస్య చంద్రులు చరిత్రపుటలను తిరగవేస్తే
పాటుపడతారు లోక కల్యాణానికై, సమాజ సంస్కరణకై ఎందరో మహనీయులు
యశశ్చంద్రికలకై ఎదురు చూడని అమావాస్య చంద్రులు
పేరు ప్రఖ్యాతులకై తపన పడని
త్యాగమూర్తులు వీరు
ప్రజాసేవలో తుదకు తమ అసువులను సహితము బాసిన
సేవాపరాయణులు
తెరవెనుకే నిలిచి పోయిన
అమావాస్య చంద్రులు వీరు
గుప్తంగా తమ సేవలను అందించు సంఘసంస్కర్తలు
అమావాస్య చంద్రులే
కంటికి కానరాకున్నా తమ కర్తవ్యాలను నిర్వహించే
అమావాస్య చంద్రులెందరో
కర్తవ్యపరాయణులు, ,సంఘ శ్రేయోభిలాషులు అమావాస్య చంద్రులెందరో చరిత్రలో.
పైకవితనాస్వంతం.
18
కవితా గానం పౌర్ణమి కవితల పోటీకి గాను
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
అంశం...ఐచ్ఛికం
శీర్షిక... పేగు బంధం
నీకు నాకు నడుమ కొలవలేనంత దూరమూ కాదు...
పిలవలేనంత దగ్గరా కాదు...
కలవాలన్న కోరిక ఉన్నా ఎగరడానికి పక్షినీకాను...
నేను చూడాలన్న ఆశ వున్న రావడానికి నాకు కాళ్లు లేవు...
ప్రపంచ చిత్రపటంలో నువ్వు ఒక చోట,
నేనొక చోట,
పేగుపాశాల ప్రబంధ కావ్యాన్ని రచిస్తూన్నాను రుచి లేని దినాలను గడిపేస్తూ,
పస్తుల ప్రయాణాన్ని చేస్తున్నా,
అంగుళమంతున్న చరవాణి నీ హృదయ వాణిని వినిపిస్తుందని
ఘడియ ఘడియ నీరాకకై నా గుండె, నీ పలకరింత పులకరింతకై ప్రతిక్షణం కొట్టుకుంటూనే ఉంటుంది ప్రతి నిత్యం నీ మాటలు వినాలని,
నా మది వీణ ఆవేదన నీకు వినిపిస్తుందో నన్న ఆశ...
నీతో గడిపిన క్షణాలను తలచుకుంటూ,
నీతో గడిపిన కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ,
సమయం దొరకని నీ దినచర్యలో కాసిన్ని క్షణాలను కేటాయించు... ఈ అలసిపోయిన అమ్మ గుండె కొట్టుకుంటుంది రా, నీకై భారంగా...
చేదించలేని దూరాల పద్మవ్యూహాన్ని దాటి రాలేక...
కొన ఊపిరితో ఈ శ్వాస ఆగిపోక ముందే ఓసారి వచ్చి కనబడురా,
మసక బారిన ఈ కళ్ళు మూత పడక మునుపే.
హమీ పత్రం...ఈ కవిత నా స్వీయ రచన
19
కవితాగానం సీజన్ 6 భాద్రపద మాస పౌర్ణమి కవితా పోటీలకు
08-09-25
పేరు:-
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:-హైదరాబాద్
అంశం:- ఐచ్ఛికం
శీర్షిక:-
నా కేమి తెలియదా?
...........................
కరాగ్రే వసతే లక్ష్మి అన్నట్లు
ఉదయం లేస్తూనే చేతిలో చరవాణితో
ఆడుతున్న మనుమలను వద్దని మందలిస్తే
నీ కేమి తెలియదు తాతయ్య అని
సంప్రదాయ దుస్తులు ధరించి
పవిత్ర దేవాలయానికి వెళదాం అంటే
మీ కేమి తెలియదన్న కొడుకు కోడలు
పెళ్ళీడుకు వచ్చిన పిల్ల రాత్రి పది గంటల కొస్తే
లేటయ్యిందెందుకంటే
మీ రోజులు వేరు ఇప్పుడింతే నాన్న అన్న
కన్న కూతురు
తహసీల్దార్ గా వచ్చిన నా దగ్గర చదివిన విద్యార్థిని
పేదలకు సహాయం చేస్తున్నావా అంటే
మాష్టారు నైతికవిలువలు మాటలకే పరిమితం
బాగున్నప్పుడే ఇల్లు చక్క బెట్టు కోవాలంటే
నాతో ఏబది సంవత్సరాలు కాపురం చేసిన ధర్మపత్ని కూడా
మీ కేమి తెలియదు ఇంకెన్నాళ్ళు జీవిస్తాం
ఎవరిని ఏమి అడగకండి అంటే
నలుబది సంవత్సరాలు అధ్యాపకునిగా పనిచేసి
ఉత్తమ అధ్యాపకునిగా
ఎంతోమందిని తీర్చిదిద్ది
రాష్ట్రపతి పురస్కారం పొందిన నేను
డెబ్బది సంవత్సరాల వయస్సులో
నాలో నేనే అనుకున్నా
నిజంగా నాకేమి తెలియదన్నది...!!
.............................
హామీ పత్రం:-
ఇది నా స్వీయ రచన
కవితాగానం పౌర్ణమి పోటీల కోసమే వ్రాసినది
ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
హైదరాబాద్.
...........................
20
కవితాగానం
సీజన్ 6 భాద్రపదమాస పౌర్ణమి కవితల పోటీ
కవితలపోటి
9 9 25 సోమవారం
వాణిసరోజిని లక్కరాజు
9491054829.
మమతానురాగాలను, అక్షరీకరిస్తూ,
మధురభావాలను మనోజ్ఞంగా పంచుతూ
కష్టసుఖాలను, కడగండ్లు, కన్నీళ్ళను
కలంలోని సిరాతో కాగితంపై నింపి
వ్రాసిన కవరు , కార్డులను, తనకడుపులో
భద్రంగా దాచే ఎఱ్ఱడబ్బా ,కనుమరుగవుతున్నదా?
కళ్ళలోవత్తులేసుకొని, ఎదురుచూపులుచూస్తూ
గుమ్మంలో కాపలాకాసే రోజులు కాలంచేశాయా ?
అవును. నిజమే 180యేళ్ళుగా మనప్రియనేస్తమై మనకష్టసుఖాలు పంచుకున్న తపాలాడబ్బా, మనకు,కనబడకుండా, మాయమై పోయింది.
ముత్యాలవంటి అక్షరసుమాలలో
సుధామధుర భావనలు పొదవి,
ప్రేయసి కందజేసే ప్రేమలేఖలకు యికశెలవే !
అమ్మ,నాన్నలు, ఆప్యాయతను రంగరించి
యోగక్షేమాలను అందజేసే కబుర్లకు కరువేకదా !
కలంస్నేహం, చెలిమిబంధాలకిక చెల్లు చీటీలే.
ఎండనకా, వాననకా, యింటింటి తలుపుతట్టి ,కబుర్లుమోసుకొచ్చే,పోస్టమేన్.,కనుమరుగయినాడు నేడు .
ఏమోయ్ సుబ్బారావ్ !మాకేమీ పోస్టలేదా?
అంటూ, ఆత్మీయ పలకరింపులకిక ఆఖరి రోజులే.
స్వీయరచన దేనికి అనువాదం, అనుకరణకాదు.
21
కవిత గానం సీజన్ 6
భాద్రపద పౌర్ణమి కవితల పోటీ నిమిత్తం వ్రాసిన కవిత
తేది:8/9/25
అంశం:ఐచ్ఛికాలు
రచన: డాక్టర్ బల్లూరి ఉమాదేవి.
***********
శీర్షిక :నేటి తీరు
తిన్నది అరగక ఒకడు
తినడానికి లేక మరొకడు
అలమటించారు అన్నట్లుగా
కట్టుకోవడానికి గుడ్డలు లేక
బిక్క మొహాలేసుకొని కొందరు తిరిగితే
చిరిగిన గుడ్డలు ధరించడమే
నేటి నాగరికత అనుకొంటూ
ఎక్కువ వెలకు కొని వీధుల్లో
అంగాంగ ప్రదర్శనలిస్తూ
దేశ సంస్కృతిని బ్రష్టు పట్టిస్తూ
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు
పక్క వారిని చూసి మురిసిపోతున్నారు
ఇది పద్ధతి కాదని దండించాల్సిన పెద్దలే
చూసీ చూడనట్టు ప్రవర్తిస్తుంటే
ఏమైపోతుంది దేశసంస్కృతి అనే
బాధ అంతరంగంలో మొదలై
పాత తరం వారిని వేధిస్తోంది
తనువులో మోము చేతులు తప్ప
ఏదీ బహిర్గతం కాకుండా వస్త్రాలను
ధరించే దేశంలో పుట్టిన మనం
ఆ సంస్కృతీ సంప్రదాయాలను
దిగజార్చేలా చిరిగిన బట్టలతో
ఉచ్ఛ నీచాలు మరిచి సిగ్గు విడిచి
నడి బజారులో తిరుగుతూ ఉంటే
బిత్తరపోయి చూస్తుందదిగో భారతమాత.
డా. బల్లూరి ఉమాదేవి
కామవరం ఆదోని
కర్నూలు జిల్లా
22
కవితాగానం సీజన్ 6
భాద్రపద మాస పౌర్ణమి పోటీ కోసం 11
ఏడెల్లి రాములు
ది*08*09*25
శీర్షిక*వానచినుకులు...
వాన చినుకులే జడుసుకుంటున్నాయేమో
నరుని అత్యాశల కబ్జాకోరల ఆవలే పరుగు
తన ఆవాసంలో పురుగు పుట్టా చెట్టూ
పక్షీ మృగాలు సేదదీరేవి చెలిమి కోరేవి
వయ్యారంగా సింగిడీ రంగులను అద్దుకొని
జల జల జారే కొండల వాల్జడ కరువై పోగా
నా పయనమెటో ఎటమటమౌతూ
చెమటలు పడుతుంటే ఆగి ఆగి పోతున్నా
శివా! శంకరా!
నీ జటాజూటంలోనే హాయి హాయి గా ఉన్న
ఎందుకు స్వామీ ఇలా కరుణలేకుండా
ఒకేసారి కుంభవృష్టిగా ఒదిలేస్తున్నావు
అడవిలోనైనా చల్లగాలిలో విహరిద్దామనే
మనుసున్నా
ఎక్కడా పూలతల తేనెల ఫల రసాల చెట్లు
తేనెటీగల సంగీతం వినలేకపోతిని కనలేదు
కలువలతో కనులారా ముచ్చట్లు చెబుతామని ఉన్నా
ఏడా కానరావాయే ఏమైందీ ప్రభూ?
నీ పవిత్రమైన త్రినేత్రంతో దర్శించి చెప్పలేవా!
వంతెనలు కొత్తవేనటా
కొంచెం నా ఒరవడి చొరవకే చొప్పబెండై
లేచిపోతే నన్నే నిందిస్తుండ్రు!!!
చిగురాకుల చిరుగాలులకే చెట్లు ఒరిగితే
చూశా వేళ్ళు పైపైనే ఉన్నవి నన్నే బద్నాం
చేస్తుండ్రు
స్వామీ రామసేతువు లా దారులుంటే
ఈ సొద తప్పేదిగా
పారుకం కాలువలకు యోజన చేస్తే
నా దారి తేరులో నే పోదునుగా!
శివా గంగాధరా నా దారికి అడ్డుగా
ప్లాస్టిక్ వ్యర్ధాలూ లేకుండా నీ భక్తులకు
జ్ఞాన బోధ చేయు తండ్రీ!!!
ఏడెల్లి రాములు ✍️
ది*08*09*25(21*40)
ఎల్కలపెల్లి 🦢
జిల్లా*పెద్దపల్లి
పగిలినగాజుముక్కల్లా గుంతల దారులు
గండ్లు పడిన నీటి కట్టలు
23
కవితా గానం సీజన్-6
భాద్రపద మాస పౌర్ణమి కవితల పోటీ
తేది 8-9-202
అంశం ఐచ్చికం *శీర్షిక--తెలుగు గంగోత్రి*
*రచన - లలితా చండి*
***** ****** *****
అరవిరిసిన మందారంలా
భావల
పురివిప్పిన మయూరంలా
అక్షరాలలోఒదుగుతూ
అనాదిగా జాతికి వన్నె తెచ్చే వాణిగా
సుమరాణిగా వసి వాడని
కుసుమ విరిబోణి నా భాష
సంస్కృతికి పుట్టినిల్లై
సంప్రదాయానికి మెట్టినిల్లై
దేశ విదేశాలలో తనదైన శైలిలో
శర పరంపరలలా శబ్ద సౌందర్యానికి నిలయమై పలుకు పలుకులో
పలు రాగాలను పలికించు వసంత రాగల కోయిల
అనురాగాలను పెంచే అమర గానం వినించేదేనా భాష
మంచిగంధపు పరిమళాలను
మలయ మారుతంలా వీస్తూ సేద తీర్చేదే నా భాష
వినసొంపుల కమనీయ కలవాణీ
అలౌకిక భావనలలో ఓల లాడించే
మానస సంచారణి
కమనీయ గాన విలోలిని
సంగీతాన ఆపాత మధురమై
సాహిత్యంలో ఆలోచానామృత ధారియై
దశదిశలు జాతి సౌరభాన్ని వెదజల్లే అమృత ధార నాభాష,
నర నరాలలో దేశ భక్తిని
పెంచిన ప్రభోద గీతం నా భాష
అలసిన సొలిన మనసుకు సేద తీర్చే ప్రణయ భామిని నా భాష
లలిత లావణ్యాలతో విలసిల్లే నిత్య నూతన స్నిగ్ధ సుందరి నా భాష
నేడు పలచపలచగా చినుకులుగా చెదురుతూ స్వపాలనలో పొడిబారుతోంది ఎందుకో,
తరతరలాలుగా శతాబ్ధాల పరపాలనలోనూ పసివారి నోటా పల్లవించిన గంగోత్రి.
స్వీయ రచన
లలితా చండి
8-9-2025
****** ***** *****
24
కవితాగానం సీజన్ 6
బాద్రపదమాస పౌర్ణమి నగదు కవితలపోటి
అంశం:ఐచ్ఛికం
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం
శీర్షిక:సాగినంతకాలం....
చెలిమి బలిమిగా ఉన్నంతకాలం సాగుతుంది భవిత
సాగినంతకాలం ఎవరికీ ఎవరూ తీసిపోరు
చెలిమి చెడితే చాలు ఇక అన్నీ అగచాట్లే
ప్రభుత్వమైనా సమాజమైనా ఇక్కట్లపాలే
ఏదన్ను లేకుండా ఎవరూ ఎదగలేరు
స్వయంచాలకంగా సాగినా చేయూత కావాలి
స్వయంశక్తి స్వయంకృషితో ఎదిగినవారుంటారు
వారినిచూసి ఓర్వలేని వారంటారు
తగువులు పెడతారు
తగువులు తీర్చుతామని ప్రగల్భాలు పలుకుతారు
నీకు నేనున్నానంటూ నాటకాలు ఆడతారు
ఇరువురితోటి మంతనాలు సాగిస్తారు
ఇద్దరి దగ్గర ప్రయోజనాలు పొందుతారు
అనుకున్నది సాధించాక పక్కకి తప్పుకుంటారు
తప్పుమాదికాదని తన్నుకు చావండని తెరచాటుకు తొలగిపోతారు
సాగినంతకాలం తమకు తామే సాటియని మురిసిపోతారు
సాగకపోతే క్రిందన చతికిలపడిపోతారు
తమశక్తియుక్తులను కూడా మరచిపోతారు
పరాన్నభుక్తులుగా బ్రతుకుతారు
అదే పరంపరని కొనసాగిస్తారు.
ఇది నాస్వీయరచన.
25
కవితాగానం సీజన్ 6
భాద్రపదమాసం పౌర్ణమి కవితల పోటీ
అంశం : ఐచ్చికం
కవితా శీర్షిక : పంపకాలు
*************
ఆకలి డొక్కలనో..
పొదల్లోని పసికందు ఆక్రందనలనో
స్త్రీ అరణ్య రోదనో..
శ్రామికుని వడలిన దేహాన్నో
అన్నదాత ఆక్రందనలనో..
చూసి నీ గుండె లోంచీ తన్నుకొచ్చిన ఆరాటం
చేతుల సాయమై ముందుకొస్తే..
అది కదా మానవత్వం
నీ కోసమే.. నీ సుముఖాని కొచ్చే
ఏ కుచేలుడి అటుకులో..
ఎన్ని పిడికిళ్లు తింటావో..
నీ పళ్ళెం లో ని రొట్టెముక్క కోసం చూసే
బడుగు జీవుల కేమిస్తావో..
తేల్చుకోవాల్సింది నువ్వే
ఒక్క క్షుద్బాద ను అపగలిగి
ఒక దేహాన్ని తడిమి చూసి
జాలి వాగులో మునకలేసి..
కష్టమైనా కళ్ళకద్దుకుని
మనిషితనాల కోసం పడిగాపులు పడాలి
మూన్నాళ్ళ జీవితం ముగిసేది
నీ చేతుల్లో లేకున్నా...
రోజూ జీవించొచ్చు
జీవితాన్ని నీ పరం చేసుకోవచ్చు
కాలం నిండుగా నిన్ను నువ్వు నింపుకోవచ్చు
పావురాలకు గింజలిసరడం
అక్వేరియం లో ఫీడ్ చల్లడం
అంధున్ని రోడ్డు దాటించడం ఇవేనా..మానవత్వమంటే ?
ఏ ఒక్క జీవనంలో నైనా
అతలాకుతలాల నాపగలిగితే
వంద చోక్కాల నీ వార్డ్రోబ్
ఒక్క అనాచ్చాదిత దేహాన్ని కప్పగలిగితే
ఏ అక్షరాలకో నీ చేయూత పలక నివ్వగలిగితే
మనిషితనం విలసిల్లుతుంది
కాసిన్ని గింజలు దొరికితే..
సమిష్టి పంపకాలెలాగో
ఒక్క రెక్క తెగి పడితే..
పరామర్శ లెలాగో
శత్రువు చేత చిక్కితే
ఉమ్మడి పోరాట మెలాగో..
పశు పక్షాదులను చూస్తూ..ఉండు
పాఠాలను నేర్పిస్తాయి
నేస్తమా మనం
బుద్ధిజీవులం..
కన్నీటి విలువ నెరిగినోళ్ళం
చిరునవ్వుల ను సమంగా పంచుకుందాం
డా. దారల విజయ కుమారి హహహ
నమస్తె సర్/ మేడం
ఈ కవిత నా స్వంత రచన అనువాదం కాదు. ఎక్కడా ప్రచురితం కాదు.
డా. దారల విజయ కుమారి
26.
కవితా గానం
9.9.25 ..... మంగళవారం
అంశం:: ఐచ్చికం
శీర్షిక:: ఉదయ భాస్కరుడు
కవిత వెంకటేశ్వర్లు కర్నూలు
8309920625
సప్తాశ్వరూడుడు
చీకట్లను చీల్చే ఆదిత్యుడు
లోకాన్ని మేలుకొలుపే లోకరక్షకుడు
కనిపించే దైవమతడు
తూర్పు దిక్కున ఉదయించి
వెలుగుల కిరణాలు ప్రసరించి
విటమిన్ డి ప్రసాదించి
ఆరోగ్యప్రదాతగా దీవించి
ప్రజలకు మేలు కలిగించిన సూర్యదేవర
సూర్య నమస్కారాలతో ఆరోగ్యము భద్రత
తొలగిపోతుంది నిర్లిప్తత
మనిషికి ప్రతి పని హుషారు
పారిపోతుంది బేజారు
ఎవరు నిద్రలేచిన లేవకున్న
తన వేళకు ఉదయిస్థాడు
ప్రతి యుగములో కనిపించే
దైవము
ప్రాణి కోటికి ఆధారమైన దేవుడు
పశువులు మొక్కలు నోరు లేని
జీవాలకు
చేయూత నిచ్చే దేవుడు
నిరంతరము లోకాన్ని కాపాడే
ప్రత్యక్ష పరమాత్ముడు!!
స్వీయ రచన అని హామీ
27.
.కవితా గానం సీజన్ 6
భాద్ర పద మాసం పౌర్ణమి కవితల పోటీ:
అంశం: ఐచ్చికం
ప్రక్రియ:వచనకవిత
కవితా శీర్షిక:
"" పరివర్తనే పరిష్కారం ""
నీ స్వార్ధం కోసం ప్రకృతిని వికృతంగా మార్చి
లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు...
మానవతను మరచి వృద్దాప్యంలో కన్నవారిని వృద్దాశ్రమాలలో చేర్చి
వారిని దిక్కు మొక్కు లేని అనాధల్ని చేస్తున్నావు!
ఆడపిల్లల పుట్టుకను భారంగా తలచి
పురిటీలోనే వారిని చంపుతూ స్త్రీల జననాన్ని నిరోధిస్తున్నావు...
ధన వ్యామోహంతో కట్నకానుకలకై వనితలను వేధిస్తూ
అతివల జీవితాలలో కన్నీటి వరదను పారిస్తున్నావు....
మొహావేశంలో మధమెక్కిన మృగానివై
ఆడతనాన్ని వినువీధుల్లో ఊరేగిస్తున్నావు...
కఠినహృదయుడవై రాక్షసుడిలా ప్రవర్తిస్తున్న నువ్వూ ఓ మనిషివేనా?!
మనిషి చేసిన మరమనిషికైనా మనసుంటుందేమో గాని
బ్రహ్మచే సృష్టించబడిన నీకు లేకుండా పోయే ఆ మనస్సు!
మనసేలేని కఠినశిలవై మిగలక
కష్టనష్టాలు నిన్ను ముట్టడించక ముందే పరివర్తనతో ప్రవర్తించు
నీ పరివర్తనే అన్ని సమస్యలకు పరిష్కారమని గ్రహించు!
****************************
రచన:డాక్టర్.
ఆళ్ల నాగేశ్వరరావు( కమల శ్రీ)
కవి...రచయిత....ఆర్టీసీ కండక్టర్
నాజరుపేట
తెనాలి....5222౦1
గుంటూరు....జిల్లా
ఆంధ్రప్రదేశ్... రాష్ట్రం
చరవాని:7416638823
క్రమసంఖ్య:107
****************************
పై వచనకవిత నా స్వీయరచనేనని హామీ ఇస్తున్నాను.
28
కవితాగానం సీజన్ 6
భాద్రపద పౌర్ణమి కవితా పోటీ
తేదీ:09-09-2025, సోమవారం
అంశం:ఐఛ్చికం
శీర్షిక:ఓహో ప్రకృతీ!
పేరు:మద్ది. పుల్లారావు
ఊరు:నందిగామ
-------....
ప్రకృతెంత రమణీయం!
గుబురుగా ఉన్న పచ్చని చెట్లు
సృష్టి లోని హరితదవమంతా
అచ్చటికే వచ్చిచేరిందా యున్నట్టు లేదూ?!
పచ్చని పొలాల సోయగం
వెచ్చని బానుని ఉషోదయం
గుబాళించు కుసుమాల పరిమళం
విహరించు కీటకాలు రంగులమయం
పక్షుల కిలకిలరావాల సవ్వడి
కొలనులోని మీనముల అలజడి
కొండల మాటున బానుడున్నాడా?
బానుడి వెలుగున కొండలున్నాయా?
పశు,పక్ష్యాదులతో ఎంతో సందడిగా
వృక్ష సంపదతోఎంతో హాయిగా
ఆస్వాదించే మనసుంటే చాలు
సృష్టిలో తన్మయత్వం చెందించే అందాలెన్నో
ప్రకృతిలోని పంచభూతాలు
మనకు భగవంతుడిచ్చిన వరాలు
కవుల కల్పనకు ఆదారమగునది ప్రకృతి
యుగళ గీతాలుగా, విరహ గీతాలుగా
పచ్చదనం లో చిత్రీకరణ వర్ణనాతీతమే
కృత్రిమత్వపు ఛాయలో
ప్రకృతి వి విస్మరిస్తున్నాం
అందిన కాడికి ప్రకృతి మాతను హింసిస్తున్నాం
ఉత్పీతాలతో ఫలితమనుభవిస్తున్నాం
ప్రకృతి ని ప్రేమించు
పృకృతే మనను రక్షించు
........
ఇది నా స్వీయరచనయని తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.
Comments
Post a Comment