పుష్య మాసం పౌర్ణమి 2022

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
******************
అంశం: రైతు విజయం
********************
1.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
2. టేకు మళ్ళ విజయ లలిత గారు
3.ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
4.మహమ్మద్ అఫ్సర్ వలీషా గారు
5.కవిత వెంకటేశ్వర్లు గారు
6.దోసపాటి వెంకట రామచంద్రరావు గారు
7.నాగమోహన్ యెలిశాల గారు
8.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
9.డా.కమలాదేవి గారు
10. ఏడెల్లి రాములు గారు
11.. ఆళ్ళ నాగేశ్వరరావు గారు
12.తిప్పావఝల నరసింహ మూర్తి గారు
13.యం. అపరాజిత రెడ్డి గారు
14.నల్లు రమేష్ గారు
15.జోషి పద్మావతి గారు
16.డా.తంగిరాల నాగలక్ష్మి గారు
17.డా.బల్లూరి ఉమాదేవి గారు
18.మద్ది పుల్లారావు గారు
19.వేమూరి సత్యవతి గారు
20.కోరాడ గారు
21.బాలు కత్తులు గారు
22.మేకల రామస్వామి గారు
23.బొప్పెన వెంకటేశ్ గారు
24.దేవికారాణి రత్నాకర్ గారు 
25.పిన్నక నాగేశ్వరరావు గారు
26.తరణికంటి సూర్య లక్ష్మి గారు
27.సింగీతం సంతోష్ కుమార్ గారు
28.గంగపురం శ్రీ నివాస్ గారు
29.వనపర్తి గంగాధర్ గారు
30.కట్ల శ్రీ నివాస్ గారు
31.పొర్ల వేణు గోపాల్ రావు గారు
32.వేదాంతం సురేష్ బాబు గారు
33.గొర్రెపాటి శ్రీను గారు
34.దారల విజయ కుమారి గారు
******
సమీక్షలు
*******
కవితా గానం  సమూహాన్ని  అన్నీ సమూహాలకు భిన్నంగా  విభిన్నంగా ఎంతో సమర్థవంతంగా కవులకు పౌర్ణమి పౌర్ణమికి నగదు బహుమతి అందిస్తూ , ప్రోత్సాహ కరంగా కవితలు వ్రాయిస్తున్న
వీరా  సార్ గారికి, లలిత మేడమ్ గారికి 💐🙏💐🙏💐


 అందమైన వీడియో తో చక్కని సుమధుర గానంతో  గానాలాపన చేస్తూ పేరు పేరునా విజేతలను  ఉత్తేజ పరచటం
ఈ రథ సారధులకే సాధ్యమౌనేమోనని పిస్తుంది.సందర్భానికి తగినట్లు కవితలు వ్రాయించడం.అందమైన ప్రశంసా పత్రాలతో అభినందించడం తెలుగు పట్ల తెలుగు  భాష పట్ల  వారికి గల అభిలాషకు అభివందనం  .ఇలాంటి సమూహం లో నేనూ ఒక సభ్యురాలి నైనందుకు చాలా సంతోషంగా ఉంది.  హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు 
జడ్జ్ మెంట్ అవకాశం నాకు  ఇవ్వడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను. సమూహ మిత్రులు సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను 🙏🙏
*రైతు విజయం* కోసం సమూహం లోని మిత్రులందరూ చాలా చక్కని కవితలతో అలరించారు , రైతును తమ చిక్కని కవితలతో అంబరాన అధిరోహించారు. రైతు కష్టాలను తమ అక్షరాల  కన్నీళ్ళతో హృదయానికి హత్తుకున్నారు.కొందరు కవితాత్మకంగా వ్రాసి రైతును మెప్పించారు.  మొత్తానికి రైతును గెలిపించి విజేయులయ్యారు.అందరూ చాలా బాగా వ్రాశారు. అందరికీ 
హృదయపూర్వక అభినందనలు 💐💐💐💐💐💐💐💐💐
విజేతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐💐💐💐💐💐💐💐💐💐💐

*కోరాడ నరసింహారావు గారు*....
       చాలా చక్కని కవితతో  రైతు కష్ట నష్టాలన్నిటినీ మిళితం చేసి మనసుకు హత్తుకునేలా వ్రాశారు. నిజంగా రైతు గెలుపంటే అన్నదాతకు హార్దిక స్వాగత పిలుపే. మీకు   నా హృదయపూర్వక అభినందనలు సార్ 💐🙏💐.....
*************************
*టేకుమళ్ళ విజయ లలిత గారు*....
చక్కని విజయ దరహాసం చూపించారు తమ కవితలో రైతు సాధక బాధల గురించి వ్రాస్తూ అన్నదాత అంటే భువిపై వెలసిన భగవత్స్వరూపుడని చక్కని నిర్వచనం ఇచ్చారు చాలా బాగా వ్రాశారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు మేడం 💐🙏💐
*************************
*కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు*.....
రైతును చేనుకు చెలికాడు అంటూనే ,  మట్టిని మధువుగా మార్చి  మర్మము తెలిసిన కర్మ యోగిగా ,మన్నుతో మమేకమై మిన్ను నంటిన ఆత్మ యోగిగా చేసి , అడుగులు తడబడని ఉక్కు మనిషి గా నిలిపి చక్కని కవితను వ్రాసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్  💐🙏💐....
*************************
*కవిత వెంకటేశ్వర్లు గారు*...
రైతును చక్కగా అన్నదాత అయినా ప్రాణదాత అయినా కారుణ్య దాత అయినా అతనే లాభ నష్టాల కతీతంగా నిలబడే ధైర్యం కలవాడని తమ కవితలో రైతు సాధక బాధలను  చక్కగా  వ్రాశారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ . 💐🙏💐
***********************
*డా.కమలా దేవి గారు*...
చాలా హృద్యంగా వ్రాశారు కవిత రెక్కాడితే గాని డొక్కాడని రైతులు, కుటుంబాలను పోషించలేక   కష్టాలతో  ఆత్మ హత్య  చేసుకోవడం చాలా బాధాకరం. చాలా బాగుంది కవిత. మీకు నా హృదయపూర్వక అభినందనలు మేడమ్  💐🙏💐..
*************************
*ఏడెల్లి రాములు గారు*...
విభిన్నమైన శీర్షిక తో రైతుల కష్టాలను ఏకరువు పెడుతూ, 
ఆత్మ హత్య ల ఉరితాళ్ళను తెంపేదెవరంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ చాలా బాగా వ్రాశారు .మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 💐🙏💐
*************************
*యం.అపరాజిత్ రెడ్డి*...
శ్రామిక రైతుకు కష్టాలు ఎన్ని  వచ్చినా, ప్రభుత్వం రైతు నిస్సహాయుడని మభ్య పెట్టినా, తను పడే శ్రమలోనే తన్మయత్వుడై విజయం సాధిస్తాడంటూ చాలా బాగా వ్రాశారు కవిత. మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 💐🙏💐
*************************
*తంగిరాల నాగలక్ష్మి గారు*...

పల్లె జీవనానికి, పట్న వాసానికి  , రైతులకు, ఉద్యోగస్తులకు తేడాలు చెప్తూ సహజ సిద్ధమైన వాతావరణంలో తృప్తిగా జీవనం గడిపే రైతు దే విజయని చాలా చక్కగా వ్రాశారు కవితను .మీకు నా హృదయపూర్వక అభినందనలు మేడమ్  💐🙏💐
*************************
*తిప్పాఝుల నరసింహ మూర్తి గారు*....
 గాంధీజీ స్ఫూర్తి తో రైతులు స్వాభిమానంతో మొక్కవోని దీక్ష తో ధర్మ పోరాటం చేసి తమ విజయాన్ని స్వంతం చేసుకున్నారని వారి కష్ట నష్టాలను చక్కగా తమ కవిత ద్వారా తెలిపిన మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 💐🙏💐.
*************************
*బాలు కత్తుల గారు*....
ఎన్నో ఆశలతో దుక్కి దున్ని నాట్లు వేసి చేతి కొచ్చే పంట కోసం ఎదురు చూసే రైతుకు చివరకు వరుణుడు కరుణించక చివరకు నిరాశతో మళ్ళీ మట్టి తో చేతులు కలిపి చెమట సేద్యం చేస్తున్నాడని ఆవేదనతో వ్రాసిన కవిత చాలా బాగుంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 💐🙏💐.
*************************
*మేకల రామస్వామి గారు*...
చక్కని శీర్షిక తో వందనమోయీ హాలికా అంటూ కంద, ఆట వెలది , తేటగీతి పద్యాలలో రైతును ఎక్కడ ఏ కొద్ది మాత్రమైనా ఈర్ష్యా లేని మహోన్నతుడంటూ ఎన్ని జన్మలైనా మరువమంటూ , అతని చెమ్మ గిల్లిన నయనాలకు దమ్ముగ నిలవాలని చాలా  బాగా వ్రాశారు సార్. మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐🙏💐
*************************
 *బొప్పెన వెంకటేష్ గారు*...
చక్కని శీర్షికతో కవితాత్మకంగా వ్రాశారు రైతు కష్టాలు. దళారి లిపిలో చట్టాలు చెమట భాషను రాస్తున్నట్లు నటించి కన్నీళ్ళ కామాలు పెట్టాయనడం చాలా బాగుంది. చివరికి చట్టాలు చేతులెత్తేసి విజయం మట్టి వాసన వీచిందనడం చాలా బాగుంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు  💐🙏💐
*************************
*పిన్నక నాగేశ్వరరావు గారు*...
తేటగీతి, ఆటవెలది పద్యాలతో నూతన చట్టాలతో  రైతుల కష్టాలను వారు సాగించిన పోరుతో ప్రభుత్వాన్ని మెప్పించిన విజయం చాలా బాగా వ్రాశారు సార్. మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐🙏💐.
*************************
*శ్రీమతి కే.దేవికారాణి రత్నాకర్ గారు*....
రైతు కష్టాలను చాలా ఆవేదనగా వ్రాశారు చక్కని  చిగురు విప్లవం శీర్షిక తో. ఎప్పుడూ మద్దతు ధర లేక, ప్రకృతి విపత్తులతో బాధ పడే రైతు పెత్తందారుల కార్పోరేట్ అనుకూల చట్టాలను కోత కోసి మార్పిడి చేసి తూర్పార పట్టాడని చాలా బాగా వ్రాశారు మేడమ్. మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐🙏💐.
*************************
*శ్రీనివాస్ కట్ల గారు*....
 కండలు కరిగించే హలధారికి ఎద్దుల గంటలు మ్రోగినప్పుడే పంటకు సార్ధకత, వ్యవసాయ క్షేత్రమే అతనికి వెన్నెముక ,చెమట చుక్కలు వరినాట్లకు అద్దడం చాలా బాగుంది  . చాలా బాగా వ్రాశారు సార్. మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐🙏💐
*************************
*తరణికంటి సూర్యలక్ష్మి గారు*...
పసిపిల్లల మాదిరి పోషించు పంటను ఏడాది కష్ట పడినా పంట చేతికందదని రైతన్న లేనిదే రాజిల్లదు రాజ్యమని ఆవేదన చెందుతూ పరమేశుడు మన రైతన్న అంటూ వ్రాసిన కవిత చాలా బాగుంది. మీకు హృదయపూర్వక అభినందనలు మేడమ్ 💐🙏💐
*************************
*పొర్ల వేణుగోపాల రావు గారు*...
చక్కని ఉత్పలమాల పద్యాలతో ఉద్వేగంగా  రైతు కష్టాలను వివరించిన తీరు బాగుంది.  రాతిన సేద్యము చేసి రత్నపు రాసుల జన్మ నిస్తాయంటూ,గుట్టుగ కష్టాలు దాచిసవ్వడి చేయడు గూటిలో  గువ్వ వలె నంటూ వ్రాసిన కవిత చాలా బాగుంది సార్  హృదయపూర్వక అభినందనలు మీకు💐🙏💐
*************************
*ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు*....
రైతు స్వేచ్చ కు భంగం కలిగి నప్పుడు ప్రభుత్వం తో పోరాడి గెలిచి తన హక్కులను సంపాదించి విజయాన్ని సాధించి లాల్ బహదూర్ శాస్త్రి గారి నినాదాన్ని అక్షర సత్యం చేశారు జై జవాన్ జై కిసాన్ అంటూ విజయం సాధించిన రైతే రాజంటూ వ్రాసిన కవిత చాలా బాగుంది సార్ మీకు నా  హృదయపూర్వక అభినందనలు 💐🙏💐
*************************
*వేదాంతం సురేష్ బాబు గారు*...
రైతు వ్యధను చాలా వ్యధ చెందుతూ  వ్రాశారు శిస్తుల భారం మోపెడు కాగా  ఆలి పుస్తెలమ్మి అప్పులు కట్టినా అవి ఏనాటికీ తీరనివి. పూవులమ్మిన చోట కట్టెలు కంటే ఆత్మ హత్య నే శరణ్య మంటూ చాలా బాధాతప్త హృదయంతో బాగా వ్రాశారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 💐🙏💐
*************************
*తాతపూడి సొమశేఖర శర్మ గారు*...
రైతు ఎంతో నమ్మకం తో కష్టం తో ఇష్టం తో  పంటను ఓ క్రమంలో తీర్చి దిద్ది కోతకొచ్చాక అమ్మటానికి అతని మనసు ససేమిరా అన్నా జీవనం గడవాలంటే అమ్మక తప్పని పరిస్థితి లో తను  నమ్మకంతో శారీరక శ్రమతో  పండించిన ఆ ఆనందం చాలు అని చాలా బాగా వ్రాశారు కవిత మీకు నా హృదయ పూర్వక అభినందనలు సార్ 💐🙏💐
*************************
*నాగమోహన్ యెలిశాల గారు*.....
హరివిల్లు కున్నంత ఆదరణ వరిమడి కుండదేం, అందాని కున్నంత ప్రాధాన్యత అన్నం పెట్టే రైతన్నకు ఎందుకుండదనే ప్రశ్నించే తీరు బాగుంది. పిట్టల్లా రాలి పోతున్న రైతుల శవాలను చూసి గాయపడిన ఏ కవి గుండె స్పందించదు .ఏ కలం కన్నీరొలకదు.రైతుల నెత్తురోడిన ఆ పాదాలే రేపటి సూర్యోదయాలై మొలకెత్తుతాయి రైతు ను రాజును చేస్తూ. చాలా బాగుంది సార్ కవిత కవితాత్మకంగా తీర్చి దిద్దారు.మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐🙏💐
*************************
*ఆళ్ళ నాగేశ్వరరావు గారు*..
ప్రకృతి ఎంత ప్రకోపించినా సాయమెవ్వరు లేకపోయినా  రైతులు పుడమి తల్లి నే విశ్వసించే నిత్య శ్రామికులు .చేసే ఉద్యమాలలో నిజాయితీ ఉన్నప్పుడు ప్రజల భాగస్వామ్యం తోడైతే ఆ ఉద్యమాలు  విజయం సాధిస్తాయని చాలా బాగా వ్రాశారు సార్. మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐🙏💐
*************************
 *నల్లు రమేష్ గారు*.....
చక్కని శీర్షికతో కవితాత్మకంగా మలిచిన కవిత చాలా బాగుంది. నిగూఢంగా నర్మగర్భ గా వ్రాశారు. అన్నదాత మదిలో ఎన్ని ఆంక్షల గోడలు కట్టినా , అడవి చిత్రం గీచి వేట తప్పదని హెచ్చరించినా, చివరికి శిశిరాల సిగలో గెలుపు  పూలు తురిమాయంటూ చక్కని నిర్వచనం ఇచ్చారు. చాలా బాగుంది సార్ కవిత. మీకు నా హృదయపూర్వక అభినందనలు. 💐🙏💐
*************************
*జోషి పద్మావతి గారు*...
కష్టేఫలి అంటూ కష్టానికి ఫలితం అందుకున్న నాడే రైతు  అమిత లాభంతో కష్టం తీరి భాగ్యవంతుడైన శుభవేళ ఫలసాయంతో కనుమ సంస్కృతీ సంప్రదాయాలతో అష్ట సిధ్ధులతో హర్షం వ్యక్తం చేయాలనే మీ కవిత చాలా బాగుంది మేడమ్ గారు. మీకు నా హృదయ పూర్వక అభినందనలు 💐🙏💐
*************************
*డాక్టర్. బల్లూరి ఉమాదేవి గారు*.....
చక్కని ఆటవెలది కంద పద్యాలతో రైతు విజయాన్ని తెలిపారు. నిండుగా వానలతో చెరువులు నిండితేనే  పంటలు ఏపుగా పెరిగి రైతు గుండె బరువు తగ్గుతుంది. వృక్షాలను మనం కాపాడుకున్నప్పుడే వర్షాలు పడి కరువు కాటకాలు లేకుండా అన్నదాత ఎదుగుతున్న కన్న బిడ్డ వలె చూసుకుని  మురిసిపోతాడని చాలా బాగా వ్రాశారు మేడమ్. మీకు నా హృదయపూర్వక అభినందనలు💐🙏💐
*************************
*వేమూరి సత్యవతి గారు*....
నిజమే ఓ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోంటే  ఎన్ని సార్లు ఎన్ని మనసులు కోరుకోలేదూ దేశమంతా భారత జట్టు గెలవాలనే తలంపుతో మ్యాచ్ అంతా అయ్యేదాకా చూసి మనో ఏకాగ్రత తో గెలిపిస్తాం .అహర్నిశలూ మన కోసం అలసిన దేహాన్ని కూడా లెక్క చేయక పంట పండించే రైతన్న కు ఏ సాయ మందిస్తున్నారు. పైగా నకిలీ విత్తనాలు ఆపాదిస్తున్నారు.నిజంగా అతని విజయం అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేదే .కవిత చాలా బాగా వ్రాశారు మేడమ్ .మీకు నా హృదయపూర్వక అభినందనలు💐🙏💐
*************************
*సింగీతం. సంతోష్ కుమార్ గారు*....
రైతు  తన సంతోషాలను కూడా పక్కన పెట్టి  పగలనక రాత్రనక కష్టపడి పొలాన్ని పైరులను దైవంగా  చూసుకుంటూ ప్రాణాలను సైతం లెక్క చేయక విషపురుగుల మధ్య  కాలం గడుపుతూ పంట చేతికొచ్చేదాకా రైతు కాపాడుకుంటా డంటూ బాగా వ్రాశారు సార్. మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐🙏💐
*************************
*మద్ది పుల్లారావు గారు*..
భారత దేశంలో నేడు  రైతులకు    ఆత్మ  హత్యలే శరణ్యమవుతున్నాయంటూ , లక్షల చేతులు పండించే ధాన్యం ఒక లోగిట్లో పరుచుకుంటే కోట్ల చెమట బొట్లు కురిసే మూల్యం ఒక గుప్పిట్లో అణిగి ఉంటే నిజమైన సౌజన్యం ఊరుకుంటుందా అని ప్రశ్నించడం బాగుంది. చాలా బాగుంది సార్ కవిత. మీకు నా హృదయ పూర్వక అభినందనలు 💐🙏💐
*************************
*వనపర్తి గంగాధర్ గారు*....
రైతు కన్నుల్లో వెన్నెల విరిసి మనసు సంతోషం తో నాట్యం చేసినప్పుడు అతని ఖాళీ కడుపు నిండినప్పుడు కన్నీరు  ఆనందభాష్పాలు రాల్చి నప్పుడు, వారి ఆత్మ హత్యలు ఆగినప్పుడు, మాగాణి లో అమృత సుధలు కురిసి ఆరు ఋతువులు సహకరించినప్పుడు పంట గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అతని  విజయ మని చాలా బాగా వ్రాశారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 💐🙏💐
*************************
*గొర్రెపాటి శ్రీను గారు*....
కర్షకులంటే కష్టించి పనిచేయగలరు, అవసరమైతే ప్రాణాలకు తెగించి పోరాటాలు చేయగలరు అంటూ భూమి పుత్రుల ఆశలు ఆకాంక్షాలు ప్రభుత్వం గుర్తించి మరింత చేయూతనిస్తే రైతాంగం ప్రపంచానికే ఆదర్శ మవుతుందని చాలా బాగా వ్రాశారు సార్. మీకు నా హృదయ పూర్వక అభినందనలు 💐🙏💐
*************************
*గంగాపురం శ్రీనివాస్ గారు*...
సాగుతున్న సాగుబడికి జిమ్మిక్కు సొగసులద్ది సాగు చట్టాలు తీసుకుని వస్తే రైతులు సాగిలబడరంటూ, రైతుల పొట్టకొట్టి కార్పోరేట్లకు కార్పెట్ పరిస్తే కర్పూరంలా కరిగిపోతారు ,రైతులు పొలాల్లోనే కాదు అవసరమైతే రాజకీయ క్షేత్రం లో కూడా కలుపు తీయగలరని చాలా బాగా వ్రాశారు కవిత. మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 💐🙏💐
*************************
*దారల విజయకుమారి గారు*.....
చక్కని శీర్షిక మట్టి మద్దతు.వరుస వర్షాభావాలను వంచి చినుకులు పిండుకుని , చీడ పీడల చిక్కుల్లోంచి గింజల్ని దులుపుకుని మట్టి కిందేసినా మళ్ళీ మొలిచే ప్రక్రియ తెలిసిన రైతుకు యుద్ధం కొత్తేమీ కాదని చాలా బాగా చెప్పారు. రైతు  బాధలను చక్కగా కవిత్వకరించి వ్రాశారు . అతని పోరాటానికి మట్టే మద్దతు పలుకుతుందనడం చాలా  బాగుంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు మేడమ్ 💐🙏💐
*************************
*దోసపాటి వెంకట రామచంద్రరావు గారు*.....
తల్లి గర్భం నుండి గండం గడిచి పిండం బయట పడినట్లు అతివృష్టి అనావృష్టిని చీడపీడలను అధిగమించిన రోజు నిజమైన  రైతు విజయమని , దళారీల దురాగతాలు మద్దతు దొరకని మండీలు అన్నీ దాటుకొచ్చి దేశానికి తిండి పెట్టే రైతు నేడు అలుసై పోయాడని చాలా బాగా వ్రాశారు సార్. మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐🙏💐......


1.
 అంశం... రైతు విజయం...
ప్లవనామ సంవత్సర పుష్య మాసం.. పౌర్ణమి నగదు బహుమతి కవితల పోటీ కొరకు ... కవితా గానం
*శీర్షిక.... చేను చెలికాడు. *
స్వీయ రచన:::: *కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.*
సెల్ ఫోన్::8497924605
సెల్ ఫోన్:: 6281697982.
భద్రాద్రి కొత్తగూడెం.
***************************************

సేద్యము  చేయు... చేను చెలికాని చమట చుక్కల సార మంత
సాలిరువాలున సాగి వేరు సన్నిధి చేరి  
పంట పెన్నిధి గాంచ వలెననే వాంఛ కలిగి....  కృషీవలుని కృతం కూర్మి పెంచగ

చేను చెలకల చెలిమి చేసి మట్టి మధువుగ మార్చే మర్మమేమో తెలిసిన కర్మయోగి 
ఆకలితో అల్లాడుతూనే అందరి ఆకలి తీర్చాలని
మన్నుతో మమేకమై మిన్ను నంటిన ఆత్మ యోగి

విత్తనాలకు... విత్తానికి... వెతకటం ఆపి
సుస్థిర సాగు, సాగే తీరుకు... దారులు పరిచె తెగువకు తేజం నింపి.... సేంద్రియ ఎరువులు ఎదజల్లి శాస్త్రీయ సేద్య కిటుకులు  జోడించి....

కృతకముల విడిచి.. విత్తిన విత్తనాల మొలకల చిగురుటాకుల రక్షణకు కంచై నిలిచిన కాపు 
చీడ పీడల దోమ కాటును వేప గానుగ తైలంతో
శుద్ధి చేసి వృద్ధి రేటు పెంచిన ప్రణాళికా

ప్రకృతి ప్రకోపాల భీకర కృత్యాలు.. పాటవంతో పోటు పొడిచినా.. చెదరని స్థైర్యంతో
అంగడిలో ఆయువు తీసే మోసాల విషపు చురుకత్తుల ఛేదనానికీ వెరువక .... వేస్తున్న అడుగులు తడబడని ఉక్కు మనిషి

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు
అసలుకే ఎసరు పెట్టిన.‌... ఉసురు తీసే
ఇష్టం లేని* నల్ల చుట్టాలను * గుమ్మం లోకి రాకుండా వెనక్కి తరిమిన... రైతూ... విజయం నీదే


స్వీయ రచన:::::కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
02122021

కృషీవలుడు = రైతు
కృతం.         = నిర్ణయం
కూర్మి.          = ఇష్టం , ప్రేమ
కృతకములు = కృత్రిమ ఎరువులు
2
విజయ దరహాసం 
------------------------------
ప్రకృతి మాత ప్రకోపానికి
సవినయంగా తలవొంచి
అవని తల్లి ఆదరాభిమాన పాత్రుడవై 
సత్సంప్రదాయ సేద్య విధానాలతో
సంతుష్టుడవై 
కోట్లాది జనుల క్షుద్బాధ తీర్చ
భువిపై వెలసిన ప్రత్యక్ష
భగవత్స్వరూపుడవు నీవే కదా!
అన్నదాతవై ఆరుగాలం శ్రమించినా,
కృషీవలుడివై కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నా,
పంటకాపు వై పచ్చని పైరును సంరక్షించినా,
కర్షకుడివై కడుపు నింపినా,
వ్యవసాయదారుడివై 
సాయానికి సార్థక నామధేయుడవై నిలిచినా ,
నీకు నీవే సాటి.
నీవు లేకున్న లేదు కదా
మాకు కూటికి గతి.
ఇందుగలడందులేడని
చెప్పగలమా నీ ఉనికి?
కంటకాల మంటలనోర్చే,
చీడపీడల బాధలకోర్చే, మొక్కవోని ధైర్యాన్ని మొక్కలలో నింపి
వాటిని వృక్షరాజాలుగా మలచి
అతివృష్టి, అనావృష్టులను  అచంచల
ఆత్మవిశ్వాసంతో అధిగమించి
స్థితప్రజ్ఞతకు నిలువెత్తు నిదర్శనమైన నీవే మాకు ఆదర్శం
నీ జీవన విధానమే
ఒక ఉత్తేజ పూరిత ఉత్తమ గ్రంథరాజం.
ప్రతినిత్యం మేము చూడాలి
నీ మోముపై విజయ దరహాసం.
~~~~~~~~~~~~~~
 టేకుమళ్ళ.విజయలలిత
ఉపాధ్యాయిని
3.
శీర్షిక:- రైతేరాజు దేశరక్షణ కు సైనికుడు జీవరక్షణ కు రైతు దేశానికి వీరివురు వెన్నుముక తెల్లవారుజామున లేచి హలం పట్టి పొలందున్ని ఎండనక,వాననక అవిశ్రాంతంగా పనిచేసి పండినపంటను చూసి కష్టానికి ఫలితం వచ్చిందని రేపటి రోజు బంగారు మయమని భావించిన రైతన్న మధ్యదళారిల చేతిలో మోసపోయి పండినపంటకు గిట్టుబాటు ధర రాక సంసారాన్ని ఈదలేక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో పులిమీద పుట్రల ప్రభుత్వం కూడా చట్టాలను ప్రవేశపెట్టి రైతు స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు సంఘటితమై ప్రభుత్వంతో అవిశ్రాంతంగా పోరాడి ప్రాణత్యాగం చేసి హక్కులను కాపాడుకొని నేరుగా పంటను అమ్ముకునే హక్కును సంపాదించి విజయాన్ని సాధించి లాల్ బహదూర్ శాస్త్రి గారి నినాదం 'జై జవాన్ జై కిసాన్' ను అక్షర సత్యం చేసి విజయం సాధించి 'రైతే రాజు' దేశానికి వెన్నుముక అని నిరూపించిన రైతన్న నీకు వందనములు..!!
4.
[18/01, 7:11 am] Lalita Sister: కవితా గానం (సీజన్ 2)
ప్లవ నాప నగదు బహుమతి పోటీ 
అంశం....రైతు విజయం
శీర్షిక....ఘన విజయం 

మంచు పూలలో తడుస్తూ మైమరచి
ముంగిట ముత్యాల ముగ్గులతో సుందర రంగవల్లు లద్దినా...

మనసు మాలిన్యాలను పారద్రోలేందుకు
ముతక సామాను మూటకట్టి భోగిమంటలేసి నవమార్పు కై మనసులు మురిసినా ....

ముచ్చటైన డూడూ బసవన్నల నృత్యం మానసికుల్లాసం కల్గించినా..

మధురమైన వంటకాలు మనసు జిహ్వ చాపల్యాన్ని ఆనందడోలికల్లో  ముంచినా ....

మిన్నంటుతూ పతంగులు ఆకాశాన విహంగంలా ఎగిరేసినా.....

ముప్పొద్దులా జోడెడ్లతో జతకట్టి రెక్కలు
ముక్కలు చేసుకునే రైతన్న కష్టఫలం
ముంగిట చేరినప్పుడే రైతు
అసలు విజయం ఘన విజయం ....!!
 
హామీ....ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను 

మొహమ్మద్.అఫ్సర వలీషా 
ద్వారపూడి (తూ. గో. జి )
5
[18/01, 7:19 am] Lalita Sister: కవితా గానం - 2
అంశం:: రైతు విజయము
తేదీ:: 17.1.22..సోమవారం

ఆరుగాలం కష్టపడేవాడు అన్నదాత
అహర్నిశలు ఆలోచించే పునీతుడు
పంటలు పండించే ప్రాణదాత
ధాన్యాలతో ధరణి ప్రజని కాపాడే కారుణ్యదాత
అతివృష్టి అనావృష్టి తట్టుకొనే
ధైర్యం
లాభనష్టాలకతీతంగా చిత్తంస్థిరం
కల్తీలతో నకీలల్తో నాశనమయిన కుటుంబము
మొండిదైర్యంతో మళ్ళీ అదే పొలంపని ప్రారంభం
కష్టాలొచ్చిన నష్టాలొచ్చిన చెదరని గుండె బలం
దిగుబడి తక్కువైనా రాబడి రాకపోయినా
తరతరాలుగా నమ్ముకున్న భూమిని వీడని బలహీనత
ఇంటికొచ్చిన బంధువులను
ఆదరించే మనసు విశాలత
చట్టాలు చేసి అడుగడుగునా
బాధలకు గురిచేసిన
మధ్య దళారులు వ0చనలతో
వంచించిన
మార్కెట్ యార్డులో మోసాలు
చేసిన 
దగా చేసి దండుకున్న
మొక్కవోని స్థైర్యంతో మొక్కలను పెంచుతాడు
రేబవళ్లు పొలాన్ని అంటిపెట్టుకొని ఉంటాడు
పైరును ప్రాణంగా పెంచుతాడు
దిగుబడి వచ్చేదాక దిగులులేకుండా ఉంటాడు
యంత్రాలు వచ్చాక పని సులువైపోయే
అంతర్జాలం వచ్చాక ద్రోహాలు
ఎక్కువైపోయే..అయినా....
రైతు కష్టం ముందు అన్నింటికి
అపజయమే
ఎప్పటికీ రైతుదే విజయము
రైతు లేకుంటే లేదు మనకు
అన్నము....అనుపానము!!
                  కవిత వెంకటేశ్వర్లు
కర్నూలు.      8309920625
పై కవిత నా స్వీయ రచన అని
హామీ
6.
కవితాగానం పుష్యమాసం పౌర్ణమి నగదు పురస్కారాలకోసం అంశం:రైతువిజయం. ఆరుగాలం కాయకష్టంచేసి కళ్ళలోవత్తులు పెట్టుకొని ఎదురుచూసి ఎదురుచూసి గడిపేకాలం దగ్గరై చేనులో పంట చేతికొచ్చిన రోజు అది నిజంగా రైతువిజయమే! తల్లిగర్భంనుండి గండం గడిచి పిండం బయటపడినట్టు అతివృష్టిని అనావృష్టిని చీడపీడలను అన్నిటిని అధిగమించినరోజు నిజమైన రైతువిజయం! నకిలివిత్తనాలు కల్తీక్రిమిసంహారకాలు దళారిల దురాగతాలు మద్దతుధర దొరకని మండీలు వీటన్నిటిని దాటుకొస్తేనే రైతువిజయం! నల్లచట్టాలు నల్లబజారులు న్యాయస్థానాలివ్వలేని తీర్పులు వీటన్నిటిని ఎదిరించిననాడు రైతువిజయం! తాను పస్తులుండి దేశానికి తిండి పెట్టె అన్నదాత అందరికి అలుసైపోయాడేమో నేడు సంక్రాంతి పండగంటే ధనధాన్యాలతో పల్లెలు నిండెరోజు పండగంటే సంవత్సరానికొకసారి వచ్చేరోజు ఆరోజే ఆరోజే రైతువిజయం! ఇది నాస్వీయరచన. దోసపాటి వెంకటరామచంద్రరావు పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా చరవాణి7780594995.

7.
నాగమోహన్ యెలిశాల గారు

అంశం : రైతు విజయం శీర్షిక : రాబోయే కాలానికి కాబోయే రాజు కవిత : ఏదైనా ఇంతేనా...?/ హరివిల్లుకున్నంత ఆదరణ వరిమడికుండదేం..?/ అందానికిచ్చే ప్రాధాన్యం అన్నం పెట్టే రైతన్నకక్కర్లేదా...?/ చట్టాలెన్నొచ్చినా...చెమటచుక్కను ఇంధనంగా చేసే/ కష్టజీవుల బతుకు చిత్రం మారటం లేదేంటో...!/ కర్షకుడింకా ఇంకా కష్టాల ఊబిలోనే అవిటెద్దులా కూరుకుపోతున్నాడేం..?/ లోకాన్ని పోషించే రైతుకు శోకమే మిగిలిందిగా...!?/ గిట్టుబాటు ధర లభించక/ గుట్టుచప్పుడు కాకుండా ఉరితాడుకు ఉట్టిలా వేళాడుతుంటే.../ కన్నపేగుల...తెరుచుకున్న ఆకలి నోళ్ళు చూసి/ బరువెక్కిన గుండెలు ఉక్కిరిబిక్కిరై ఒక్కసారిగా ఆగిపోతుంటే.../ కవి గుండెలోని దుఃఖమంతా/ కలం కంట్లో కన్నీరై ఒలకదా...!?/ పిట్టల్లా రాల్తున్న రైతుల చిక్కిన దేహాలను చూసి/ ఆవేదనా గేయమై/ గాయపడిన గుండె కోతతో అక్షరాల కవాతు చేయదా...!?/ మనుగడకు ముప్పు కలిగితే...తలబడుతుంది ఏ జీవైనా../ ప్రాణాలను ఫణంగా పెట్టైనా బరిలోకురుకుతుంది ఏదేమైనా.../ పుట్టల్ని చీల్చుకువచ్చే చీమల దండులా పాదాలన్నీ ఏకమై.../ కదులుతున్న మట్టి సైన్యంలా విరుచుకుపడతాయి/ యాంత్రికమైన అధికారుల మొద్దు నిద్రా జాడ్యం పై కొడవల్లెత్తి/ కన్నీరొడిచే రైతుకళ్ళు చండ్రనిప్పులు చెరుగుతాయి/ నెత్తురులొడిచే పాదాలు రేపటి సూర్యోదయాలై మొలకలెత్తుతాయి/ రైతును రాజును చేస్తూ భావితరాలకు బాటలు వేస్తాయి
8.
తాతపూడి సోమ శేఖర శర్మ గారు

కవితా గానం అంశం..రైతు విజయం శీర్షిక.. మనసునవున్న నమ్మకం మనసున వున్న నమ్మకంతోనే రైతు దుక్కు దున్ను కుంటాడు విత్తనాలు చేలో జల్లుకుంటాడు ఆకుమడిని అందంగా వేస్తాడు చేలో వరుసలలో నాటుతాడు నీరు బోదెలనుండి పెడతాడు కలుపు కదలకుండా తీస్తాడు బాటలులైన్ గా పిల్లలచేవేయిస్తాడు చేను పొడవుగా ఎదుగుతుంది మొక్కలకి బాగా పొట్టలొస్తాయి ధాన్యం గుత్తులు వేసుకుంటాయి ఆకుపచ్చని చేలు పండుతాయి పసుపుపచ్చగా కళకళలాడతాయి ధాన్యం పాలు పోసుకుంటూ గింజ బాగా ముదురుతూ ఎదుగుతుంది కోతకి వస్తుంది బాగా పండిన పంట కోయిస్తాడు రైతన్న చేలోనిపంటలు పనలు పాయలు పాయలుగాకట్టిస్తాడు ధాన్యo బల్లకొట్టు కొట్టించి నూర్పిస్తాడు ధనలక్ష్మిని రాసులురాసులుగాపోస్తాడు అందమైన ఆరాశి కనులవిందుచేస్తుంది అమ్మడానికి రైతు చాలాబాధపడతాడు రెక్కలు ముక్కలు చేసుకునిపండిస్తాడు కానీపంటకుచేసిన అప్పులుతీరాలిగదా తప్పకఅమ్ముతాడు తనుఎంతో కష్టపడి ఆత్మవిశ్వాసంతో పండించిన పంటను మనసులో వున్న నమ్మకంతో ఇష్టపడి పండించిన బంగారు పసిడిపంటను మట్టిని నమ్ముకున్న మన రైతన్నకు ఎప్పుడూఆనందమే.జీవనానందమే సంపూర్ణoగా తన శరీర శ్రమతోనే అనందం పొందు రైతన్న జీవనం ఎల్లప్పుడు ఆరోగ్యప్రదమే...... ప్రతిరోజు ఆనందదాయకమే..... ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం, 8328079336
9.
[18/01, 9:43 am] Lalita Sister: కవితాగానం
ప్లవనామసంవత్సరం, పుష్యమాసం, పౌర్ణమి నగదు 
పురస్కారాలకై 
నాకవిత 
అంశం : రైతువిజయం
శీర్షిక : రైతన్నల పోరాటం
మనదేశ వెన్నెముక రైతు
భరతమాత నేత్రాలలో ఒకనేత్రం రైతే
భరతమాతముద్దుబిడ్డ రైతు
మనందరి కడుపులునింపే అన్నదాత రైతు
మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి
మట్టినే నమ్ముకొని  అమట్టిని
బంగారం చేసేవాడు రైతు
తనరక్తాన్నే చెమటగా మార్చే 
కృషీవలుడు ,శ్రమదాత రైతు
మనకడుపులు నింపేది
ఆరైతుల కష్టమే
రెక్కాడితేనే కానీ డొక్కాడదు
డొక్కలు నిండితేకాని
రెక్కలాడవు ఆరైతులకు
రెక్కలాడక డొక్కలు నిండక
అనేక కష్టాలపాలవుతున్నారు
ఋణాలు దొరకక 
దొరికిన ఋణాలు తీర్చలేక
ప్రకృతి కరుణించక
అతివృష్టి అనావృష్టులతో
బాధపడుతూ 
కుటుంబాలను పోషించలేక
పాలుపడుతున్నారు ఆత్మహత్యలకు
ఇరుక్కుంటున్నారుప్రభుత్వ చట్టాల చక్రాలఇరుసుల్లో
న్యాయ పోరాటం చేస్తున్నారు
బలిఅవుతున్నారు 
మధ్యవర్తుల మోసానికి
ఎన్నో కష్టాలకు ఓర్చి
పండించిన పంటలకు చేకూరటంలేదు న్యాయం
ధరల నిర్ణయంలోను లోపమే
సాగించారందుకే పోరాటాన్ని నిరవధికంగా
'మినిమమ్ సపోర్ట్ ప్రైస్'
ఎమ్. ఎస్. పి  కోసమే
ఈపోరాటం
అందుకే జరిపారు ఆందోళనలను
నిలబడ్డారు  నడిరోడ్డుపై నిద్రాహారాలుమాని
అహోరాత్రాలు
దిగివచ్చింది ప్రభుత్వం
జరిగాయి సంప్రదింపులు
రైతులకు సరి యైన న్యాయం
జరిగిననాడే
రైతుల వేదన ,శోకం,కడగండ్లు 
కష్టాలు తీరిననాడే
ఆరంభమవుతుంది నూతన
శకం
రైతే రాజైననాడు , రైతే విజయాన్ని సాధించిననాడు
అప్పుడే కలుగుతుంది
దేశ సంక్షేమం.

పేరు : డా.కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566

పైకవిత నాస్వంతం. అనుకరణ కాదు.
10
: కవితా గానం
అంశం*రైతు విజయం*
శీర్షిక *గండదీపం*
అనాది జీవన వేదం
అన్నం పెట్టే రైతన్న జీవనం
యుగాల చరితకు శ్లోకం
సామాజిక యజ్ఞానికి భవితవ్యం 

నేలంతా తడిగా పరుచుకున్న చెలిమ
పత్రహరితమై తిరుగుతున్న చెలిమి

విత్తనం తన భోషానానికి దూరమై
నూతన పెట్టుబడులు భారమై
కాలానికి గండదీపమై వెలిగిన రైతు
దరిదొరకని తండ్లాట లో జీవన్మరణం

ఆచరణకు ప్రకటనలకు పొంతనేదీ
భీమా ధీమాయై వచ్చిన దాఖలేదీ
విపత్తులనుండి రక్షించే మార్గమేదీ
ఆత్మహత్యల ఉరితాళ్ళను తెంపేదెవరు

కబ్జాకున్న రైతుకు పట్టా ఉంటేనే
గలీజ్ గాల్ల గాయితనం ఆగేది
ప్రభుతే రైతు జనపదానికి
 జవాబుదారీగా నిలవాలి

ప్రపంచీకరణతో మేటిగా
సాగుబడి భేషుగ్గా సాగాలి
ఎవుసం గొలుసు ఘోషకు
శాస్త్రం జతగా విత్తన జడ్డిగమై నడవాలి

అనంతం రైతు భారతం
సమస్యల పీటముడులు ఊడితేనే
ధాన్యలక్ష్మకి ధనలక్ష్మి తోడయ్యేది
పంటతోపాడి కలిస్తేనే రైతు విజయం

ఏడెల్లి రాములు ✍️
ది*18*01*2022(09*45)
ఎల్కలపెల్లి
 జిల్లా* పెద్దపల్లి
11.
శీర్షిక; "" ముందడుగు "" సాయమెవ్వరూ చేయకున్నా వ్యవసాయమే చేసుకుంటూ కష్టనష్టాలు ఎదురైనా కాయకష్టాన్నే నమ్ముకుంటూ ప్రకృతి ప్రకోపించినా పుడమితల్లినే విశ్వసిస్తూ ఆరుగాలం శ్రమిస్తూ అన్న ప్రసాదాన్ని జనులకు అందించే నిత్య కృషీవలులు రైతులు! అక్కడ రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దుకై సాగించిన వీరోచిత పోరాటం.... ఇక్కడ మూడు రాజధానుల వ్యతిరేక పోరాటం..... వెరసి రైతన్నల సమిష్టి ఉద్యమాల సారాంశం! ఎక్కడైనా,ఎప్పుడైనా చేసే ఉద్యమాల్లో నీతి నిజాయితీలు వెన్నంటి ఉంటే వాటికి ప్రజల భాగస్వామ్యం తోడైతే ఆ ఉద్యమాలు సాధిస్తాయి విజయాలు అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఆయా చట్టాల రద్దుకై తీసుకున్న నిర్ణయాలేతార్కాణాలు! ఆ రద్దుల వెనుక దాగున్న దూరాలోచనలను గ్రహించి సంపూర్ణ విజయం సాధించేంత వరకు అప్రమత్తులై రైతులందరు సమిష్టిగా ఉద్యమించాలి దూరాలోచనలతో ముందడుగు వేయాలి! !
12.
[18/01, 12:59 pm] Lalita Sister: కవితా గానం
పష్యమాసం పౌర్ణమి నగదు పురస్కారాల పోటీకి
అంశం:రైతు విజయం
శీర్షిక:ధర్మయుద్ధం
తిప్పావఝల నరసింహమూర్తి

అందరికీ అన్నం పెట్టే రైతన్నలే నిజమైన దేవుళ్ళు/
ఆదేవుళ్ళ సంక్షేమానికే ముప్పు వాటిల్లింది వ్యవసాయచట్టాలరూపంలో/
తప్పలేదు వారికి చట్టాల రద్దుకు ధర్మపోరాటం/
గాంధీజీ స్పూర్తితో రైతన్నలు సాధించారు సత్యాగ్రహమే ఆయుధంగా సర్కారుపై విజయం/
ప్రాణాలకు తెగించి సాగించిన అలుపెరుగని పోరాటమే వారి విజయ రహస్యం/
ఈ విజయం కోసం చేసారు ఏడాదికి పైగా నిరంతరపోరాటం/
వారి ధృఢసంకల్పం దుప్పటైంది ఎముకలు కొరికే చలికి/
వారి మనోనిబ్బరం పందిరైంది మండుటెండలకు/
వారి ఆంజనేయుని  ఉగ్రరూపాలకు తోకముడిచింది కరోనా భూతం సైతం/
ప్రణాళికాబద్ధంగా కుటుంబసమేతంగా వేసారు రోడ్లపై తిష్ట/
రోడ్లే అయినాయి వారి ఆవాసాలు, రైల్వే ట్రాక్ లేఅయినాయి వారి నివాసాలు./
ప్రభుత్వ అవరోధాలే అయినాయి పోరాట సోపానాలు/
అహింసాయుత ఘెరావ్‌ లు,ధర్నాలు,ప్రదర్శనలే అయినాయి వారి ఆయుధాలు/
స్వాభిమానమే అయిందివారికిరక్షణకవచం/
ఘోరతపస్సుకు శివుడు దిగి వచ్చినట్లుప్రభుత్వం దిగిరాక తప్పలేదు వారి అకుంఠిత దీక్షకు/
వారి మొక్కవోని దీక్షముందు తలవంచక తప్పలేదు మేరునగం/
క్షమాపణలతో చట్టాల రద్దు ప్రకటించిన మోడీ రాజకీయజ్ఞత
ప్రసంశనీయం/
నభూతోనభవిష్యత్ అన్నట్లు సాగిన ధర్మపోరాటం భావితరాలకు మార్గదర్శకం/
కార్పొరేట్ల కబంధహస్తల్లో చిక్కుకోకుండా రైతన్న సాధించిన విజయంశ్లాఘనీయం/
వ్యవసాయం కాదు దండగ-పండగే అయితేనే రైతన్నకు నిజమైన విజయం/
13
[18/01, 1:50 pm] Lalita Sister: అంశం: రైతు విజయం 
శీర్షిక: శ్రామిక రైతు!
పేరు: యం అపరాజిత్ రెడ్డి 
ఊరు: సూర్యాపేట 
ఫోన్ నంబర్: 9848532031

చితికిన బ్రతుకుల దైన్యం
తరతరాలుగా నలగ్గొట్టబడ్డ జీవితాలు 
ప్రకృతిలో మమేకమైన జీవన పోరాటం 
పంటపొలాలు తన జీవన ధాత్రి 
నాగలి,పలుగు,పార,గొడ్డలి తన ఆయుధాలు 
తొలకరి వర్షాలు కురిసిన వేళ 
రైతు పట్టిన నాగలి సాల్లు సాల్లుగా దున్నుతూ 
యజ్ఞంలా సాగే సేద్యం!
తను నమ్ముకున్న భూమి మోసం చేయలేదు 
ప్రకృతి కన్యక తన పాదాల చెంత ప్రణమిల్లింది 
రైతు గొంతెత్తితే ఆలమందలు మాటవిన్నాయి 
తన శ్రమ జీవనంలో ఎద్దులదే ప్రధాన పాత్ర 
విసుగన్నది ఎరుగక తను చేసే వ్యవసాయం 
కమ్మరి నిప్పుల కొలిమిలో ఎర్రగా కాలిన ఇనుప కర్రులా 
తన గుండెల మంటలకు ఆవిరి పడుతూ,,,,,,,!
అకాల వర్షాల కోర్చి కరువు కోరల కోర్చి ,,,,,,,,,
అయినా పచ్చదనాల తన పైరు పైరగాలుల్లో తన్మయుడై 
దుక్కి దున్ని వరినాటి పంటనూర్చనిదే ధాన్యం రాదు 
సమస్త మానవాళికి ఆహారాన్ని పెడుతూ 
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ రైతు విజయుడే!
చేతగాని ప్రభుత్వాలు రైతు నిస్సహాయుడని సహాయం అందిస్తున్నామని మభ్యపెడుతూ 
ఓట్ల గల్లపెట్టె పట్టుకుని తిరిగే నాయకత్వం,,,!
రైతు రోడ్లపై పడిగాపులు గాచి అమ్మినా తన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించని వీళ్ళు,,,,,
రైతు తన శ్రమలో పొందే తన్మయత్వం ముందు దిగదుడుపు!!

అపరాజిత్ 
హామీ పత్రం: ఈ కవిత నా స్వీయ రచన అని నా హామీ
14
నువ్వు రమేష్ గారు
తొందరపాటు చిన్న బోయింది

అన్న దాతల మదిలో ఆంక్షల గోడలు కట్టావు వైవిధ్య భారతంలో చెమట చుక్కలు వేరు చేశావు నాగేటి సాళ్ళ రాతలు నచ్చినట్టు చదువుకున్నావు మెత్తున్న పొట్టకే మెతుకు నాడి పట్టిచ్చావు బక్కచిక్కిన మేకలని పులి మాటలు నేర్చుకున్నావు అడవి చిత్రం గీచి వేట తప్పదని హెచ్చరించావు పుర వీధులలో పోరాట విత్తులు చల్లుకుని నిలబడ్డ పట్టుదల మొక్కలు బెదిరింపు గాలులకు బెదిరేది లేదని తేల్చాయి మండుటెండలను నీడలుగా పరుచుకున్నాయి నాలుగు చెరగల వేర్లు పరిచి సంకల్ప ఆకులు రెట్టింపు చేశాయి శిశిరాల సిగలో గెలుపు పువ్వులు తురిమాయి తొందరపాటిప్పుడు చిన్నబోయింది పులిని సైతం మేకని గుర్తు చేసి ప్రజాస్వామ్యం సాధించాయి
15.
జోషి పద్మావతి గారు
అంశం:రైతు విజయం
 శీర్షిక *కర్షక హర్షం* ************
 కష్టేఫలీ యన్నది మన పెద్దల మాట ఆ పెద్దల మాటే చద్దన్నపు మూట కష్టానికి ఫలితమందుకున్ననాడే రైతన్నకానందం కర్షకహృదయాని కానందమే వశమైన విజయం పాడిపంటల సమృద్ధే కృషీవలునికి శక్తి బసవన్నల తోడ్పాటే పెంచేనాసక్తి ఆరుగాలం శ్రమ కావాలి సఫలం అమితలాభంతోనే తీరేను ఆ కష్టం భాగ్యవంతుడైన శుభవేళ రైతన్న కొత్తధాన్యముతో భోగిపండుగజేసి క్రొంగొత్త క్రాంతితో,నూతనోత్సాహంతో సంక్రాంతి లక్ష్మినారాధించి కలకాలం భోగభాగ్యాలతో తులతూగే వరమునిమ్మని బసవన్నలనలంకరించి పూజించే కనుమ సంస్కృతీ సాంప్రదాయపు గరిమ తరతరానికీ తరగని పెన్నిధిగా మారాలీపర్వం కర్షకులంతా ఫలసాయంతో వ్యక్తపరచాలి అమితంగా హర్షం. _____________
16.
అంశం రైతు విజయం
శీర్షిక రైతన్న
డా.  తంగిరాల నాగలక్ష్మి

 రైతన్న   రావాలి పంటలు పండాలి
నేల దున్నటం మొదలు
 కుప్ప నూర్పిడి అయ్యి పంట 
ఇంటికొచ్చినదంటే రైతు విజయమే

పచ్చని పొలం కళ కళ లాడ టానికి
పైరు బాగా ఎదగ టానికి రైతు మూలం
కర్షకుల కష్టం  జనం కడుపు నింపుతుంది
ప్రకృతి సహకరిస్తే శ్రమ ఫలిస్తుంది
లేదంటే  పాపం వృధా అవుతుంది
ప్రకృతిని నమ్ముకున్న పల్లె జీవనం రైతు ది
పరుగులుపెడుతూ takeway  fastfood లజీవితం ఉద్యోగ స్తులది
పట్న వాసుల కాధారం రైతు విజయం
ఎండనక వాననక శ్రమించే జీవి రైతు
Ac  రూముల్లో మగ్గేవాడు ఉద్యోగి
స్వతంత్రం గా బతుకు హాయిగా పల్లెలో చల్లని పాక లో  ఉంటూ
 చద్ది అన్నం పొలం గట్టున తింటూ 
కాలం గడిపేవాడు రైతన్న
టైమ్ కి తిండి లేక నిద్ర లేక 
పాటు పడుతున్నానుకుం టూ 
Stress తో ఉండేవాడు పట్న వాసుడు
ఆరోగ్యం రైతుది అనారోగ్యం విద్యాధికులది
వ్యవ సాయం లో భూమాతకు దగ్గరవుతాడు రైతు 
మహర్షి లా మనుగడ సాగిస్తాడు
గర్వం గా తలెత్తుకు తిరుగుతాడు రైతు
పండించిన పంటను అందరికీ పంచుతాడు
చల్లని సహజ సిద్ధ వాతావరణంలో శాంతి గా తృప్తిగా జీవనం గడిపే రైతు దే విజయం
దేశ ము పాడి పంట లతో పురోభివృద్ధి
చెంది ప్రగతి  పథంలో నడవాలంటే
రైతు విజయ పతాకం ఎగరేయాలి
పల్లె ల్లో సౌకర్యాలు పెంచాలి
రైతు విజయం దేశ ఘన విజయం
జై జవాన్ జై కిసాన్
 రైతన్నా అంతిమ విజయం నీదన్నా
17.
డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు

శీర్షిక:రైతు విజయం
  1.ఆ.వె:వాన కురియ నిండు వాసిగా చెరువులు తగ్గుచుండు కరువు ధరణి యందు తరువు లేపు గాను పెరుగంగ రైతన్న గుండె బరువు తగ్గ కోలు కొనును.

 2.కం:తరువులు వానల నొసగగ కరువది తగ్గగ వసుధను కడుమోదముతో బరువది దిగగా నిండిన చెరువును గనియన్నదాత చింతను వీడెన్. 
 3.కం:తరువులు నరకక పెంచిన విరివిగ వానలు కురియగ విశ్వము నందున్ చెరువులు నిండగ రైతుకు కరువది తగ్గగ బరువది క్రన్నన తొలగున్. 
 4.ఆ.వె:వాన కురియ నిండు బావులు చెరువులు తరువు లొసగుపండ్లు ధరణి యందు కరువు బాధ తీర బరువు తగ్గినటుల నన్నదాత మదియు హాయి నొందె.
 .5.కం:తొలకరి చినుకులు పడగా పులకించెనుయన్నదాత భువిలో తానున్ పొలమున నాటిన విత్తులు
        మొలకెత్తగగాంచిమదిని ముదమును బొందెన్. 6.ఆ.వె:పుడమి యందు రైతు పొలము దున్నుచునుండి పగలు రేయి యనక పాటుపడుచు కన్నబిడ్డ వోలె కాపాడు కొనుచును నెదుగు చుండ చూసి నిలను మురియు.
18.
మద్ది పుల్లారావు గారు

వేదభూమి భారతదేశాన నేడు అవనిపుత్రులకు ఆత్మహత్య లె శరణ్యమాయె వివిధ బాధలతో రైతులు బోరున విలపిస్తున్న తరుణంలో కేంద్ర పాలకుల గుదిబండల్లాంటి రైతు వ్యతిరేక చట్టాలు పుండు మీద కారం చల్లినట్లాయె పుడమి పుత్రుల స్వేచ్ఛ కు ఉరి బిగించినట్లాయె లక్షల చేతులు పండించేధాన్యం ఒక్క లోగిట్లో పరుచుకుంటే కోట్ల చెమటబొట్లు కురిసే మూల్యం ఒక్క గుప్పిట్లో అణిగిఉంటే అచ్చమైన సౌజన్యం చచ్చుపీనుగులా పడిఉంటుందా? భారత నలుమూలలనుండి రైతురథం కదిలింది పన్నెండు మాసాలు పోరాట స్వరం పొంగులెత్తింది సింగాలై,శార్దూలాలై,వెన్నుచూపని యోధాగ్రేసరులై వినూత్న పోరాటం లో అభినవ గాంధీలై నిరసనోధ్యమాలను మిన్నంటించగ ఢిల్లీ పాలకుల దర్పం చిన్నబోక తప్పలేదు గదా! ఎండ,వాన,చలి త్రికాలాలను లెక్కజేయక మొక్కవోని స్థిరసంకల్పంతో వేలాది కర్షక సోదరుల పోరాట ఫలితం అసంబద్దమగు రైతు వ్యతిరేఖ చట్టాల రద్దు నిర్ణయం వ్యవసాయ ఫలసాయం కావాలి రైతే రాజై పుడమి పచ్చదనం పులకించాలి నేటి రైతుల విజయం రేపటి అభ్యుదయానికి సంకేతం
19.
వేమూరి సత్యవతి గారు

శీర్షిక.. అందరివిజయం! కబడ్డీలోనో, క్రికెట్లోనో విజయం కోసం వెంపర్లాడే మీరంతా.. అతని విజయం కోసం అడుగే వేయరేమిటి?? ప్రతీ దానికీ అప్పుచేయాల్సిన అగచాట్లెందుకు??అమర్చలేరా? నకిలీవిత్తనాలంటగట్టి రైతు నెత్తురు నీరుగారుస్తారేమి? అదను చూసి అందాల్సిన ఎరువో,బలమో అందనీయరెందుకు? మీకెవ్వరికీ తెలియదిదెంత ఆత్మద్రోహమో? అతని విజయం జాతీయ-ఆదాయం,అంతర్జాతీయపు ఖ్యాతి తెచ్చేదని తెలియదా? అతని విజయం నేలదీ నింగిదీ,రైతుదీ మనందరిదీ!! రేపటిరోజుకి తిండి భరోసానిచ్చే కల్పవృక్షమతడు!! చిన్నవిత్తు పెద్ద పంటకుప్పవటం అతడి చేతి చిట్కా!! ఎండిన పర్రెలైనపుడమి పంటమడిగివటం అతడి కృషే!! ఆకలి కడుపుకి అతడి శ్రమ అక్షయపాత్ర!! పల్లెటూళ్ళు,పొలంగట్లు అతడి ఆటస్థలం! ఎండైనా, వానైనా చింతలూ,చికాకులున్నా ఆటనాపేదే లేదు!! కృషినీ,కర్షకుల్ని వద్దనుకునే కర్మభూమి వుంటుందా?? రైతు-రెక్కల్ని కబంధాసురుని కబ్జాలు బంధించకుండా-- దళారుల-దాడి జరగకుండా--దేశీయులంతా దడికడితే నే అన్నానికి శ్రీరామరక్ష!! రైతన్నకి తిరుగులేని విజయం!! ***** ఈ కవిత నా స్వంత రచన!దేనికీ అనువాదం కాదు.
Submitted
20.
పౌర్ణమి నగదు బహుమతుల పోటీకి., అంశం :- రైతు విజ యం.(శీర్షిక శ్రమయేవ జయతే)
     కోరాడ నరసింహా రావు ! 
       *****************
నేలతల్లినే నమ్ముకుని ఎండనక వాననకా  ఆరుగాలమూ పొలం లోనే శ్రమిస్తూ ఈ ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న రైతన్నకు ఎన్నెన్ని కష్టాలు !
అతివృష్టి - అనావృష్టి కన్నీటి ధారలవుతుంటే... కల్తీ విత్తనాలు కలవరపెడుతుంటే 
పెట్టుబడులకోసం చేసిన అప్పులు వడ్డీల తిప్పలు పెడుతుంటే...  పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుంటే... బ్రతుకు భారమై... 
పురుగుల మందులతోనో... 
ఉరి తాళ్ళతోనో జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్న దుస్థితి !
ఎన్నెన్ని ఓటమిలు చవిచూస్తున్నా...నేలతల్లి పై విస్వాసాన్ని వదులుకోరు మన రైతు సోదరులు... !ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు... వడ్డీ వ్యాపారులు, దళారుల దోపిడీ మరో వైపు... కష్టాల ఏటికి ఎదురీదుతూ నిలద్రొక్కుకుంటున్న రైతు వ్యతిరేక చట్టాలతో ప్రభుత్వాలు మరో వైపు !
ధర్మబద్ధమైన హక్కులు హరించబోతాయనుకున్నప్పుడల్లా పోరాటాలు తప్పవుకదా !!
న్యాయమైన తమ  హక్కుల పరిరక్షణకై ఎన్నెన్నిసమ్మెలు, దీక్షలు, ఊరేగింపులు ఎందరెందరి  బలిదానాలు !!
చివరికి సాధిచాడు రైతు !
హక్కులను హరించే చట్టాలు రద్దయే వరకూ పట్టిన పట్టును వదలక విజయం సాధించాడు 
ఇది రైతు విజయం ! ఇది శ్రామిక ఘనవిజయం !!
రైతు గెలుపంటే... అన్నదాతకు 
హార్దిక స్వాగత పిలుపు !
   -*-*****************
    ...... కోరాడ.
21.
[18/01, 6:48 pm] Lalita Sister: రైతు విజయం

గోడ్డుకు ఏడ్చి గోదకు ఏడ్చి
ఆలి మెడలో తాళి అమ్మి
తీరని అప్పులతో..
కుంపటి లో కురపోయి..
బుడిది అవ్వకనే...
హర హర శంకర అంటూ
హలంతో దుక్కి దున్ని నాట్లు వేసి ఆరుగాలం కష్టించి 
చేతికొచ్చిన పంటను జూసి మురిసిపోతే...
వర్ణ దేవుడు నీట ముంచే
బతుకు జీవుడు కంట నీరు గార్చే
బేర గాళ్లు బేరమాడి
ఆడికి పావుషేరు అడిగిరి అయినా ఆశ చావక..
మట్టిలో మునిగి చెమట సేద్యం జేసీ పోరాటం చేస్తున్నము..
లోకానికి పిడికెడు మెతుకులు పెట్టడం కోసం ఆరాట పడుతున్నాం..
నడ్డి విరిచిన చట్టం 
కాదు శ్రమ జీవులకు చుట్టం..
చట్టాలను నమ్మితే మీము అయిపోతాం నెల మట్టం

బాలు కత్తుల
22
[18/01, 6:49 pm] Lalita Sister: కవనజ్యోతి పౌర్ణమి నగదు పురస్కారాల కవితల పోటీ
***************************************** 
అంశం:- రైతువిజయం 

      శీర్షిక :- వందనమోయి!! హాలికా!!! 
*** ********************
కందము
*******
నవ నాగరకత వృద్ధికి
జవ సత్వమ్ములను గూర్చి జాగృతపరచే
నవజీవన హాలికుడా
లవలేశమ్మీర్ష్యలేని లాక్షణికుడవే
ఆటవెలది
*********
హలము చేతబట్టి నన్నంబు సృజియించి
జనుల తిండివెట్టు శక్తి నీదె
ఎన్ని జన్మలైన నిన్ను మేమరువము
రైతుబుుణము దీర్చ చేతనగునె
తేటగీతి
*******
కనిన జీవసంగ్రామపు కార్యమందు
సత్యసంధత గల్గిన నిత్య వ్రతుడ
పరులమేలుకై నిరతమ్ము పాటుపడుచు
సిరులుపండించు మా దొరా!శరణు !శరణు!!
కందము
********
అమ్మగనాకలి దీర్చగ
కమ్మని బువ్వనిడి రైతు కడుపును నింపున్
చెమ్మగిలెడి నయనాలకు
దమ్ముగ నిలవాలి మనము దాత్రి కొమరుకున్
**************
మేకల రామస్వామి
చెన్నూర్ ,9912747214

23
[18/01, 6:51 pm] Lalita Sister: కవిత శీర్షిక: మన్ను మురిసింది

మాయల మాటున పట్టాలు తప్పిన చట్టాలు మట్టికి చేయివ్వడానికి చెంగుమని చేరాయి

ఆ చట్టాలు ప్రతి గింజ మీది పేరును చిదిమేయడానికి కొత్త ఓ రూపమెత్తుకున్నాయి

ముల్లు చూసి తూయాల్సిన గింజలను ముల్లు గుచ్చి మట్టి రక్తాన్ని త్రాగాయి

దళారి లిపిలో చట్టాలు
చెమట భాషను రాస్తున్నట్టు నటించి కన్నీళ్ళ కామాలు పెట్టాయి
ఎట్టకేలకు కనీస ధర ఒక కనికట్టే అని  తేలిపోయింది

నిండు పంట మీద పరాయి కన్ను పడితే ప్రాణ వాయువు ఊరుకుంటుందా..?
ఆకు పచ్చని పంటలు ఎరుపెక్కి ఎగబాకుతాయి

రక్తపు చుక్కల తాళంలో చెమట బొట్ల గానాలే జాతీయ గీతమై నినదిస్తున్నాయి

1857లా మట్టి మరోసారి మార్లపడి దుమ్మెత్తి పోసింది
చెమట చుక్క దొంగ కాంటా ను నిలువునా విరిచేసింది
చట్టాలు చేతులెత్తేసాయి
విజయం మట్టి వాసన వీచింది
మిన్ను నవ్వింది మన్ను మురిసింది

జెండా మళ్ళీ స్వేచ్ఛగా రెపరెపలాడింది
తలపాగా తళతళలాడింది


హామీ పత్రం: నా కవిత దేనికి అనువాదము అనుకరణ కాదు. ఏ పత్రికలో ప్రచురింపబడలేదు, పరిశీలనలో కూడా లేదు. ఇది నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను.

పేరు : బొప్పెన వెంకటేష్ 
జిల్లా: సిద్దిపేట్ 
చరవాణి : 9866584062
ఇ-మెయిల్ ఐడి: vboppena@gmail.com

24.
పుష్యమాసం నగదు బహుమతులు పోటీకి.
శీర్షిక: చిగురు విప్లవం
రచన: శ్రీమతి కే దేవికారాణి రత్నాకర్ తెనాలి
++++++++++++++++++++++++++++++++

న్యాయం ముందు అన్యాయం తలవంచింది.

కొమ్ములు తిరిగి కాకలు తీరిన ఆంబోతు ప్రభుత
కడుపు నింపే రైతన్న కాళ్ళ ముందు సాగిలపడింది.

ఏడాది పైగా సాగిన "సమ్మె సాగుబడి"కి
నేతల ప్రతికూలత మేఘమై కరిగిపోయింది.

కుహనా చట్టాల మాయావి మంత్రాలు
జిత్తు లెరుగని కష్టజీవి స్వేదం ముందు కొట్టుకుపోయాయి.

నెత్తురు చెమటను చేసి రాతి నేలలో నూ రాజనాలు పండించగల రైతు చైతన్యానికి
బడా బాబుల అందలాలు తల్లక్రిందులయ్యాయి.

సేద్యం చేసి.. మద్దతు ధర లేక ప్రకృతి విపత్తులతో
దళారీల కుతంత్రాలతో జీవ తంత్రులు తెగిపోయిన బడుగు రైతు పెత్తందారుల కార్పొరేట్ అనుకూల చట్టాలను కోత కోసి నూర్పిడి చేసి తూర్పార బట్టి రాశి పోశాడు


చీమలన్నీ దండిగా కదిలి .... కూడపెట్టుకున్న దానిని కొల్లగొట్టడానికి నెలవు చేసుకుంటున్న అనకొండలను చుట్టుముట్టి మట్టికరిపించాయి.

హరితవనాలన్నీ ఎర్రని విప్లవాలు పూస్తున్నాయి.
ఎముకలు కొరికే చలి కి గడ్డ కట్టిన నెత్తురు పోరాట పటిమతో కరిగికాల్వలై పారి ... తుది విజయం దాకా అప్పటి దాకా కొనసాగుతూనే ఉంటుంది

ఇది చిగురు విప్లవం దిద్దిన సిందూర సస్య తిలకం....
24.
పుష్యమాసం నగదు బహుమతులు పోటీకి.
శీర్షిక: చిగురు విప్లవం
రచన: శ్రీమతి కే దేవికారాణి రత్నాకర్ తెనాలి
++++++++++++++++++++++++++++++++



కొమ్ములు తిరిగి కాకలు తీరిన ఆంబోతు 
 కాళ్ళ ముందు సాగిలపడింది.

నెత్తురు చెమటను చేసి రాతి నేలలో  పండించగల రైతు చైతన్యానికి
బడా బాబుల అందలాలు తల్లక్రిందులయ్యాయి.

సేద్యం చేసి.. మద్దతు ధర లేక ప్రకృతి విపత్తులతో
బడుగు రైతు పెత్తందారుల కార్పొరేట్ అనుకూల చట్టాలను కోత కోసి నూర్పిడి చేసి తూర్పార బట్టి రాశి పోశాడు

హరితవనాలన్నీ 
ఎముకలు కొరికే చలి కి గడ్డ కట్టిన నెత్తురు పోరాట పటిమతో కరిగికాల్వలై పారి ... తుది విజయం దాకా అప్పటి దాకా కొనసాగుతూనే ఉంటుంది
25.
కవితా గానం(సీజన్2).      18--1--2022.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- రైతు విజయం.

శీర్షిక :-- రైతుల ఆందోళన.

1. తే.గీ.
ప్రభుత తెచ్చెను వ్యవసాయ రంగమందు
మూడు నూతన చట్టముల్ ముఖ్యమివియె
రైతులకు మేలు కలిగించి లబ్ధి కూర్చు
ననుచు నమలు చేయగ సిద్ధమయ్యె ప్రభుత.

2. తే.గీ.
కర్షకాళికి నష్టమున్ గలుగ జేసి
కార్పొరేట్లకు లాభమున్ గలుగ జేయు
నిట్టి చట్టముల్ వలదని యెన్నొ రైతు
సంఘములు,రైతు కూలీల సంఘములును
వివిధ ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చి
యుద్యమంబును సాగించ నుద్యమించె.

3. ఆ.వె.
దేశ రాజధాని దిగ్బంధనము నందు
రైతులంత పాల్గొనంగ, ప్రభుత
నచ్చ చెప్ప జూడ నాయకు లొప్పక
తీవ్రతరము జేసె దేశమంత.

4. తే.గీ.
దక్షిణాది రాష్ట్రముల రైతన్నలంద
రంద జేసిరి సహకార మద్భుతముగ
నిటుల పదునైదు మాసముల్ పటుతరముగ 
జరుగుచున్న నాందోళనల్ సమయజేయు
యత్నమున రైతులెందరో యమరులైరి. 

5. తే.గీ.
తుదకు ప్రభుతయె దిగివచ్చి వదలి పట్టు
రైతు వ్యతిరేక భావన కనుగుణముగ
ప్రకటనను చేయ చట్టాలు రద్దటంచు 
విజయ దుందుభి మ్రోగించి విజయులగుచు
హర్షమును వ్యక్తపరచిరి కర్షకులును.
*************************************
26.
కవితాగానం( సీజన్‌2 ) పుష్యమాసం పౌర్ణమినగదు పోటి
18/1/2022/ మంగళవారము
అంశం:- " రైతువిజయం "
రైతన్నలేనిదే రాజిల్లదురాజ్యము
దేశానికివెన్నెముఖ రైతన్న
పంటపండించువాడు కడుపునింపేవాడుపరమాత్ముడనగ 
మనరైతన్నయే

ధాన్యలక్ష్మిభాగ్యము  రైతన్న శ్రమఫలితము
ప్రగతిపధాన పయనించ కడుపుకింతకూడునందించు
పరమేశుడు మనరైతన్న

పంటపదునెరిగి పంటపండించు సమయానికివిత్తుజల్లినారు పెంచు
మొక్కనాటి నీరందించేరైతన్న
పసిపిల్లలమాదిరి పోషించుపంటను
ఏడాదికష్టపడినగాని పంటచేతికందదు
మొక్కలు మోరలెత్తి ఏపుగపెరుగుచు
కంతులువేసి గాలిలోకదలాడ రైతులదే ఆనందము

కంతులుబరువుగ కదలాడ
రైతన్నకన్నులజాలువారు ముత్యాలబిందువులన్నీ ధాన్యరాసులుగా మారు
జోడెడ్ల బండ్లలో ధాన్యమంత యిళ్ళకుచేరరైతువిజయమునకుగుర్తు
గాదులనిండుగధాన్యముసావిళ్ళ భాగ్యము
కరువులేనిదేశమనగ
     " రైతన్నవిజయము "
          తరణికంటి సూర్యలక్ష్మి.
                -----------------
27.
సింగీతం సంతోష్ కుమార్ 

సింగీతం సంతోష్ కుమార్
ఫోన్ నెంబర్ *
8897152205
జిల్లా *
కామారెడ్డి
కవిత *
రైతన్న.... రవి ఉదయించక మునుపె నిద్ర లేచి పొలాలకు చేరుకొని ఎట్ల నాగలితో దుక్కి దున్ని సంతోషంతో విత్తనాలు నాటే కష్టజీవి.... విత్తనాలు మొలకెత్తి రైతు ఆనందం పెరిగి పొలాన్ని దైవంగా పైరులను భావిస్తూ జీవించే రైతు.... రాత్రనకా పగలనకా శుభకార్యాలకు దూరంగా ఉండి పోలాలకే అంకితమై ప్రాణంగా చూసుకుంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విషపురుగుల మధ్య నిద్రపోతూ రాత్రి కావాలి కాస్తూ రక్షించే కర్షకుడు.... పైరులకు పురూలు పట్టిన తనకి రోగం వచ్చినంతగా బాధపడుతూ నిరంతరం పైరువైపె చూస్తూ ఎపుడు చేతుకు పంట వస్తుందని ఏదురుస్తూ ఉండే రైతన్న 

28.
గంగపురం శ్రీనివాస్ గారు
అంశం: రైతు విజయం తేది: 18.01.2022 "సాగని ఆటలు" సాఫీగా సాగుతున్న సాగుబడికి జిమ్మిక్కుల సొబగులద్ది సాగుచట్టాలు తీసుకొస్తే సాగిలబడుతరునుకున్నరు సర్కారు ఆటలు సాగనివ్వక సరిహద్దులు దాటి సాగనంపినరు రైతుల పొట్టకొట్టి కార్పొరేట్లకు కార్పెట్ పరిస్తే కర్షకుడి కళ్ళసెగకే కర్పూరంలా కరిగిపోతరు పొలాల్లోనే కాదు రాజకీయ క్షేత్రంలో కూడా అలుపులేకుండా కలుపు తీయగలరు వ్యవసాయానికి సాయం చేయక వ్యయం పెంచెతే వారధి కడుతం బలం ఉంది కదాని బలవంతంగా చట్టం చేస్తే కూటమి గట్టి కోటలు పగలగొడతాం వెనక్కి తగ్గేదాక వెంటపడతాం ఏడాది పాటు పోరాడి ఏడు వందల మంది ఏడుపులు వినబడితే గానీ వెనకడుగేయక పోతిరి మళ్ళీ మాతో పెట్టుకుంటే పార్లమెంటు మీద ఎగిరేది రాజకీయ జెండాలు కాదు
! రైతుల హరిత జెండాలు!!
29.
వనపర్తి గంగాధర్ గారు

[శీర్షిక:అమృతసుధలు
  ఆ కన్నుల్లో వెన్నెలలు విరిసినపుడు ఆ మనసు సంతోషంగా నాట్యం చేసినపుడు అతని కాలీ కడుపు నిండినపుడు అతని కన్నీరు ఆనంద బాష్పాలు అయినపుడు అదే కదా అసలైన కర్షక విజయం ధరణి పుత్రుని ఆత్మహత్యలు ఆగినపుడు మాగాణాల్లో అమృతసుధలు కురిసినపుడు ఆరు ఋతువులు సహకరించినపుడు పంటకు గిట్టుబాటు ధర వచ్చినపుడు అతని నయనాల వెలుగే రైతు విజయం భూమి పుత్రుని ఆకలి చావులు ఆగినపుడు కల్తీ విత్తనాల బెడద లేనపుడు దళారుల దగాలు మాయమయినపుడు అప్పులు లేని ఆనంద జీవితమైనపుడు ఇది కదా కృషీవలుని అసలు విజయం హామీపత్రం:ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
30
[19/01, 6:04 am] Lalita Sister: అంశం: రైతు విజయం
******************

ఎద్దుల గంటలు మోగినప్నుడే
రైతన్న పండించే పంటకు సార్థకత 
అప్పులు తెచ్చి ఆరుగాలం శ్రమించి 
కండలు కరిగించే హలధారికి 
వ్యవసాయ క్షేత్రమే వెన్నెముక..

చెమట చుక్కలు వరినాట్లకద్ది 
పైరులెదిగి పంట చేతికందాలని 
ధనము ధారపోసి ఎరువులేసి 
ధాన్యం ధారాళంగా రానుందని
నాలుగు మెతుకులు నోట్లోకి జారాలని సంబరపడితే రైతు చట్టాలు 
గద్దల్లా గరళం పోస్తున్నాయి.. 

ధాన్యం అమ్ముకునే వ్యవస్థను 
చట్టపరిధిలోకి తేవాలనే దురాశనేది 
రైతు నోట్లో మట్టికొట్టే పథకమే 
ఆ చట్టపు నకళ్ళు తగలడేవరకు 
మొక్కవోని పోరాటంలో అలుపులేక
సాగిన దేశవ్యాప్త రైతోద్యమం 
దేశ రాజధానిలో జయకేతనం ఎగిరి 
చట్టాలను కాలరాసి మంటల్లో 
వేసి మసి చేసిన భారత రైతు 
ప్రపంచానికి అన్నం పెట్టే ఱౌతు..

_________
శ్రీనివాస్ కట్ల 
కరీంనగర్ 
8125320540
31
[19/01, 6:05 am] Lalita Sister: *** *కవితా గానం* ***
*ప్లవ నామ సంవత్సరం పుష్యమాసం పౌర్ణమి కవితా పోటీలు*

అంశము: *రైతు విజయం*
తేదీ: *18-01-2022-మంగళవారం*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాలరావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట-రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *అన్నదాతల విజయం*
ప్రక్రియ: *పద్యము(ఉత్పలమాల)*
*********************

1)
*రైతన లోక బాంధవుడు రాశిగ ధాన్యము పండి యించగన్!*
*చేతిన నాగలున్న సరి! చిక్కని చక్కని పంట మొల్వగన్!*
*మూతికి గుడ్డనే బిగిసి మోటను జబ్బల లాగి నీరిడన్!*
*రాతిన సేద్యమే సలిపి రత్నపు రాసుల జన్మనిచ్చుగా!*

2)
*ఎండకు వానకున్ దడిసి యోర్పున నేర్పున దుక్కి దున్నుచున్!*
*మండెడి యాకలిన్ దలచి మానవ కోటికి యన్నమిచ్చునే!*
*కొండలు కొండలే దొలిచి కూటికి భూమికి సారమిచ్చునే!*
*నిండదు పొట్టయే కడకు! నీరసమందగ కష్టమేటికిన్!*

3)
*యెద్దుల జోడునే ధరణి యోధులు, పుత్రుల తీరు పెంచునే!*
*ముద్దుల మూటయౌ సతిని మోతకు, చేతకు వెంటతెచ్చునే!*
*హద్దుల నేమెఱుంగకయె హాలికుడింతగ కష్టమొందగన్!*
*మద్దతు మాటనే మరచు మాన్యుల కేపగి దింత సాధ్యమే!*

4)
*సేద్యము జేయుమన్న జడి, శీతల బాధలనన్ని యోర్వగన్!*
*వాద్యపు ఘోష కాదు, సరి వాదనలాడుచు నుద్యమించగన్!*
*సాధ్యము రైతుకే యిల! నసాధ్యము తక్కిన వారికెల్లెడల్!*
*చోద్యము జూతురే! మరలి సూచన ప్రాయపు సాయమీయరే!*

5)
*పంటకు తండ్రియే తనయె! పాడికి పైరుకు జన్మనీయగన్!*
*కంటికి నిద్రయే కరువు! కావలి యుండగ రాత్రి యంతయున్!*
*వంటికి సౌఖ్యమెక్కడిది? పైరుల గాచగ బిడ్డ తీరునన్!*
*యింటికి ధాన్యమొచ్చు! కృషి యిబ్బడిముబ్బడి వెంబడించగన్!*

6)
*పెట్టుబడెంత పెట్టినను పిల్లల పాపల బొజ్జ నిండదే!*
*గుట్టుగ దాచె కష్టములు! గూటిన గువ్వలె, రవ్వసేయకన్!*
*చట్టములెన్ని జేయవలె?చక్కబడంగను రైతు దుస్థితుల్!*
*గట్టిగ పట్టుబట్టి తమ ఘాతము జూపిరి రైతుసోదరుల్!*
*********************
హామీపత్రము: *ఇది నా స్వీయరచన. దేనికీ అనువాదం, అనుకరణ, అనుసరణ కాదు... ఈ పోటీకొఱకు ప్రత్యేకంగా వ్రాయబడినది. వేరే ఏ ఇతర మాద్యమాలకు పంపబడలేదు...*
32
[19/01, 9:47 am] Lalita Sister: కవితా గానం ( సీజన్ 2)
*************************
అంశం:-రైతు విజయం
శీర్షిక:- రైతు వ్యథ
*****************************
శిస్తుల భారము మోపెడు కాగా
పుస్తెలనమ్మి అప్పులు కట్టగ
అప్పులు దీరక తిప్పలు పడుచు
కడుపుకు లేక పస్తులు ఉంటూ
పంటలు పండక కడుపులు మండగ
పండిన పంటకు పైకము రాకము రాక
ఎరువులు కల్తీ గింజలు కల్తీ 
నిస్సారమ్ముగ భూముల  మీద
ఈడ్పు కాళ్ళతో నేడ్పు మొగముతో
బీద మొగముతో‌ పీనుగు రీతి 
వలవల యేడ్చుచు  కుళ్ళుచు వగచుచు
ఆకలి చిచ్చుకు అరకను అమ్మి
నరకము బాధలు మరిమరి పడుచును
పరువు కొరకు పరి పరి తపియించి
కూలికి నాలికి చాలగ  వగచుచు
పదుగురిలో తల‌ దించి తిరుగుచు
పూలను అమ్మిన చేతులతోనే
పుల్లలు అమ్మే సమయము రాగా
నిద్దుర మాని అద్దుమ రాత్రి
మనసు వికలమై మరి బాధించగ
చేసిన అప్పులు‌ ఉరి తాళ్ళవగ
నాగలి కొయ కొయ్యయె ఉరికంబ
రైతులు బీదగ‌ ఉన్నంత కాలము
రాజ్యము కరువుల పాలగునంచును
రైతుల బాగే  రాజ్యము బాగని
రాజులు యెంచని రాజ్యము నందున
ఉండుట బరువని ఉరికొయ్యనెక్కి
అసువులు బాసిన రైతుకు ‌ జోహార్
🖋️ వేదాంతం సురేశ్ బాబు
     చంద్రపూర్
     ‌‌మహారాష్ట్ర
33.
గొర్రెపాటి శ్రీను గారు

కవితా గానం (సీజన్ -2)
 అంశం : రైతు విజయం శీర్షిక : పోరాట ధీరులు 
 రచన : గొర్రెపాటి శ్రీను 
 "రైతన్న దేశానికి వెన్నెముక!"అన్న నానుడి నాడే కాదు
 నేడు..రేపు కూడా అక్షర సత్యమే ! 
మనం తింటున్న ప్రతి బియ్యపుగింజ 
రైతన్న శ్రమఫలితమే !
 నేల తల్లికి నమస్కరించి ..
దుక్కిదున్ని ఆరుగాలం చెమటోడ్చి
 కష్టించి .. రైతన్నలు పంటలు పండిస్తేనే..
దేశం సుభిక్షమై ఆహార కొరతలు లేని సుసంపన్న దేశమవుతుంది! 
 కానీ నేడు ప్రభుత్వాలు తెస్తున్న కొన్ని చట్టాలు రైతులని ఇక్కట్ల కు గురిచేస్తూ.. 
వ్యవసాయానికి సైతం కార్పొరేట్ కల్చర్ ని ఆపాదిస్తూ ..
 రైతులని 
తమ మార్కెట్ మాయాజాలంతో వారి 
ఉనికి ని ప్రశ్నార్థకం చేయాలని కుట్రపన్నిన వేళ..
 సంఘటితమైన రైతాంగం ఏక తాటిపై నిలిచి హక్కులకోసం ఉద్యమిస్తూ .. 
"కర్షకులంటే కష్టించి పని చేయగలరు..
అవసరమైతే ప్రాణాలకు తెగించి ప్రజా పోరాటాలు చేయగలరు " అని నిరూపిస్తూ.. 
 ఉక్కు పిడికిళ్ళు బిగించి 
ప్రభుత్వ నిరంకుశ చట్టలకు వ్యతిరేకంగా అడుగడుగునా నిరసనలు వ్యక్తం చేస్తే ..
పాలన సైతం స్తంభించి పోగా..
 దిగివచ్చిన కేంద్రం 
రైతులకు నష్టం కలిగించే చట్టాలని ఉపసంహరించుకున్న సందర్భం.. 
సంఘటిత పోరాట శక్తికి నిదర్శనం ! రైతన్నలు.. వ్యవసాయ క్షేత్రాల్లో నే కాదు .. రాజకీయాలని సైతం ధీటుగా ఎదుర్కోగలరు అని నిరూపించిన వైనం ప్రశంసనీయం ! భూమి పుత్రుల ఆశలు ఆకాంక్షలని ప్రభుత్వాలు గుర్తించి మరింత చేయూతనిస్తే.. పాడిపంటల అభివృద్ధి తో దేశం శక్తివంతమవుతుంటే .. .. మనదేశ రైతాంగం ప్రపంచానికే ఆదర్శం అవగలదు !
చెప్పు
34.
కవితా గానం
ప్లవ నామ సంవత్సరం
పుష్య మాసం పౌర్ణమి కవితా పోటీ కోసం
అంశం : రైతు విజయం
శీర్షిక : మట్టి మద్దతు
*********************

వరుస వర్షాభావాలను వంచి..చినుకులను పిండుకుని..
చీడపీడల చిక్కుల్లోంచీ గింజల్ని దులుపుకుని.
మట్టికిందేసినా..మళ్ళీ మొలిచే ప్రక్రియను
ఆవాహన చేసుకున్నోడికి..యుద్ధం కొత్తకాదు

అప్పుల ఎగుడు దిగుడుల్లోనే ఎంతని ప్రయాణిస్తాడు
కరువుల పర్యవసానాలను ఎంతని తట్టుకుంటాడు
గిట్టుబాటు ధరలు..దళారీల దమన కాండల
పాతబడిన పాటలను ఇంకెన్ని సార్లని పాడుతాడు

అన్నాన్ని చూసినపుడంతా..అగుపించదా అలవికాని ఆ శ్రమ
ఆకలి కేకల్ని అణగబెట్టినపుడు అవగతం కాదా..
అన్నదాతల ఆవేదన

సాళ్ళలో ఆశలను నాటుకుని..మొలిచిన మొక్కల బిడ్డల్ని రెక్కల కింద దాచుకుని..కార్పొరేట్ డేగలతో తలపడతాడు

మందుల నకిలీలపై గెలిచిన అగ్గితెగుళ్ళు..
గింజల్లో పాలుపోసుకోనీవు
సబ్సిడీలన్నీ..తాలు గింజలై గిట్టుబాటు కానీవు

మట్టి పైనే మనసు పెట్టుకుని..మట్టిలోనే పుణుక్కునే..ఆ ఆరుగాలం కష్టానికి..
అన్నమైనా అందమైన స్వప్నమే..
పంటబెట్టడమూ.. ఒక సాహసమే..!

తరాలుగా తనకాలుడుతూనే..తలాకింత తిండి పెట్టి..
పేదరికపు పీడకలలతో నిద్ర కరువైన కళ్ళను..
ఆకలిని వెలివేయలేేేక అణగారిన కడుపులను..

నిర్దాక్షిణ్యమైన చట్టాల తీగలతో బంధిస్తే..
తెంచుకోవడం ఓ లెక్కా..!

అతని పోరాటానికి మట్టే మద్దతు పలుకుతుంది
అడ్డగించేందుకు బ్యారికేడ్లు చాలవు
టియర్ గ్యాస్లు వాటర్ కెనాన్లు ఆ నిరసనల సెగలను ఆపలేవు..

మిత్రమా తెలుసుకో..రైతంటే నువ్వు కూర్చున్న కొమ్మ..నరికేసుకోవద్దు..!

డా.దారల విజయ కుమారి

హామీ పత్రం
*************
సర్/ మేడం
ఈ కవిత కేవలం కవితా గానం పోటీ కోసం రాసినది.ఎక్కడా ప్రచురితం కాదు.అనువాదం కాదు.
ఇట్లు
తమ‌ విధేయురాలు
డా.దారల విజయ కుమారి

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

నిరాడంబరత ౨౦౨౧