శివరాత్రి 2022

నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
**************
ఆద్యంతరహితుడై యలరారు వానికి
యభిషేకమొనరించ నార్తి యేల?

దిక్కులన్ ధరియించు దేవదేవునకును 
వస్త్రములర్పించ వాంఛ యేల?

వాసనలంటక వరలు సాంబనికిని
గంధమ్ము నలదనాకాంక్ష యేల?

ఆకలియెరుగని యాశుతోషునకును
నిడ పంచభక్ష్యాల నిచ్ఛ యేల

లోకాలు తిరుగాడు లోకేశు చుట్టి రా
నూటొక్కచుట్లని నుడువు టేల ?

జ్యోతి స్వరూపమైజోతలందెడు వాన్కి
ధూపముల్ దీపముల్ చూపనేల?

పరిపూర్ణ  తత్వమై భాసిల్లునీశుని
ప్రస్తుతించగచాలు భావమొకటి

హృదయ పద్మమందు ముదముగా వెలిగెడి 
యాత్మ లింగముపయిననమితప్రీతి
భక్తి భావనమున ముక్తిని గోరుచు
పరమ శివుని కిడుడు ప్రణతులెపుడు

**********లలితాకృష్ణ
********************************
కవి వరుల జాబితా
1.అపరాజిత్ గారు
2.మద్ది పుల్లారావు గారు
3.తోట సులోచన గారు
4.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు
5. తరణి కంటి సూర్య లక్ష్మి గారు
6.కోరాడ గారు
7.అయ్యల సోమ యాజుల ప్రసాద్ గారు
8. గజవెళ్ళి శ్రీనివాసాచారి గారు
9.గొర్రెపాటి శ్రీనివాస్ గారు
10.టేకుమళ్ళ విజయ లలిత గారు
11.డా.కమలా దేవి గారు
12/2.కోరాడ గారు
13.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
14.ముద్దు వెంకట లక్ష్మి గారు
15/2. ముద్దు వెంకట లక్ష్మి గారు
16.కవిత వెంకటేశ్వర్లు గారు
17.జోషి పద్మావతి గారు
18.తాతపూడి సోమ శేఖర శర్మ గారు
19/2.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
20.మద్దూరి సూర్య నారాయణ గారు
21.సింహాద్రి వాణి గారు
22. జక్కిడి వెంకట రెడ్డి గారు
23.డా. బల్లూరి ఉమాదేవి గారు
24/2.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
25.పిన్నక నాగేశ్వరరావు గారు
26.నరేశ్ చారి గారు
27/3.ముద్దు వెంకట లక్ష్మి గారు
28. తరణి కంటి సూర్య లక్ష్మి గారు
29. వేదాంతం సురేష్ బాబు గారు
30/3.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
**********

1
[25/02, 8:00 pm] Aparajith: 
ఫెల ఫెల ఉరుముల 
ఢమరుక ద్వనులతో 
ప్రళయ ఋద్రులు 
శివపార్వతుల నర్తనము 
అల్లకల్లోలం అవనీతలము 
భీకర రక్కసుల హరణ ము 
ముక్కంటి శివకేశవుని 
ముక్కోపి మూడో కన్ను తెరచినంతనే 
పాపకూపములో పడి పాపులు 
హర హర హర శంభో శివ 
కాపాడు మనుచు మొర పెట్టినంతనే 
కోటి ప్రభల రూపుడు ఆ శివుడు 
భోళా శంకరుడు తిక్కశంకరుడు 
తన సతితో కూడి సేయు నర్తనమాపి 
పాపులనందరిని మారుపలుకక 
తీక్షణ చూపుతో బస్మము సేయగ 
లోకాలన్నీ పుణ్యాత్ములతో ఫరిఢవిల్లె  
సుఖ శాంతుల నొసగె ఆ శివోహం!!

అపరాజిత్ 
సూర్యాపేట
2
[26/02, 9:19 pm] Maddi Pullarao Poet: కవితాగానం
....
శీర్షిక:అర్ధనారీశ్వరుడు
తేదీ:26-2-2022
ప్రక్రియ:ఇష్టపది
---------------------------   
--------------------- -- ------------------
1)

అర్ధనారీశ్వరా..అరుణాచలేశుడా
ఆదిదేవుడవీవు..ఆదిశక్తియు నీదె

అంతర్యామివీవు...యాత్మబందువు నీవు
అర్ధాంగి పదమునకు...అర్ధమివరించావు

ప్రమధ గణముల తోటి..ప్రథమ దేవుడవయ్య
దేవతలు గొల్చేటి...దేవాదిదేవుడవు

వేడిన వరములిచ్చు..విశ్వేశ్వరుడవీవె
చిత్తశుద్దిని గలిగి...శివుని పూజించుదాం

2)

లింగరూపుడవీవు...సంగమేశ్వరుడవూ
కైలాస గిరి పైన..విరాగివైయుందువు

ప్రకృతి, పురుషులిద్దరు...ఫలములిచ్చువారని
పరమాత్మతత్వమును..బాగుగా తెలిపితివి

పార్ధుననుగ్రహించి..పాశుపతమిచ్చితివి
మార్కండేయునకును..మహత్యము జూపితివి

నీలకంఠుని వేడ..నిక్కముగ జయమొసగు
చిత్తశుద్దిని గలిగి...శివుని పూజించుదాం
..

పేరు:మద్ది. పుల్లారావు
ఊరు:నందిగామ
చరవాణి:9951287113
-----
ఇది నా స్వీయరచన
3
కవితా గానం   (సీజన్ -2)
అంశం   శివరాత్రి
శీర్షిక     ఓం నమఃశివాయ

శివశివ శంకర, హర హర శంకర
మహాదేవ  శంభో శంకర, గంగాధర
పార్వతీ వల్లభ, పరమ దయాకర
కైలాస వాసా, కాశీ విశ్వేశ్వర
కారుణ్య మూర్తీ, కాపాడుము స్వామీ
చంద్ర శేఖర, శ్రీశైల మల్లిఖార్జునా
అరుణాచల, అరుణాచల, అరుణ శివా
వాయులింగేశ్వరా,  శ్రీకాళహస్తి యీశ్వరా
గుజరాత్ రాష్ట్రాన  మెరిసే సోమనాధేశ్వరా
ఉజ్జయిని   మహాకాళేశ్వరుడవై  వెలసిన దేవా
రామేశ్వర    రామలింగేశ్వరా 
హిమాలయాలలో    ధగ ధగలతో  
వేసవిలో  వెలిసే   అమరనాధేశ్వరా
కేదారనాధేశ్వరా,  వైద్య నాధేశ్వర
లయకారుడవైన . పరమేశ్వరా
పాహిమాం పాహిమాం రక్షమాం

తోట సులోచన
నెల్లూరు
చరవాణి   9490173053
4.
[అంశం.....శివరాత్రి.... 25022022
శీర్షిక....శంభో శంకర.
******************************

పల్లవి...

హరహర శంకర పాపభయంకర
శివశివ  శంకర శిష్ట అభయంకర 

అనుపల్లవి|| 

బోలో శంకర సాంబసదాశివ
జై బోలో శంకర ఉమామహేశ్వర
హర హర  శంకర.‌‌.. జయ జయ  శంకర

చరణం|| .‌‌..1

పార్వతీ వల్లభ పావన శంకర
పార్వతీ నాధా ఓ పరమేశ్వర
పార్వతీ సహితా హే శివ శంకర
పార్వతీ పతియే ఈశా మహేశ్వర

చరణం|| .‌‌..2

గంగాధరాయ శివ శివ శంకర
జటాధరాయ హర హర శంకర
శశి ధరాయ జయ జయ శంకర
గజ చర్మాంబర భవ శివ శంకర

చరణం|| .‌‌..3

కైలాస వాసా పాహిమాం పాహిమాం
గిరిజా ప్రియాయ నమో నమః
స్మశాన వాసా రక్షమాం రక్షమాం
విభూతి భూషణ విశ్వేశ్వరాయా

చరణం|| .‌‌..4

శివ శంభో శివ శంభో శివ శంభో
ఢమ ఢమ ఢమరుక నాదం శివశంభో
తాండవ ప్రియాయ హరహర శంభో
మృత్యుంజయాయ శివశంభో శివ శంభో

చరణం|| .‌‌..5

లింగోద్భవ కారణ  సదాశివ శంకర
సృష్టి స్థితి లయ కారణ కారక శంకర
త్రినేత్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ
మహేశ్వరాయ మహాదేవాయ నమో నమః


స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
25022022
5.

[27/02, 8:05 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన 2 )
27/2202/  ఆదివారము
అంశము--- శివతాండవము
                  (1)
సీ ! సంద్యవేళశివుడు  తాండవమాడంగ
ప్రమదగణములన్ని  పాడుచుండ

మెడలోనిగజ్జెలు  మెల్లగ మ్రోగంగ
నందియుచక్కగ   నాట్యమాడె

వివిధదరువులతో  విష్ణువు మద్దెల
మ్రోతలువినిపించె  మోదమొంద

నారదతుంబుర  నాదాలతోడను
వెలుగులుచిమ్మగ  వెండికొండ

ఆ ! శివుడు నృత్యమాడ  సిగ్గులొలుకగౌరి  
నాట్యమాడెమగని  ననుసరించి
సాయసంధ్యవేళ  సాగిన నృత్యము
శంకరుతలనున్న  శశియుగాంచె 1.
                  ( 2 )
సీ ! అష్టదిక్పాలురు  అతితోషునృత్యము
కనులారగాంచగ  కదలివచ్చె

నీలకంఠునినృత్య  లీలలుతిలకించి
ముల్లోకవాసులు  మురియుచుండె

నటరాజునృత్యము నాలుగుదిక్కుల
నడుగుసవ్వడులతో  నదురుచుండె

అలజడిరేపెను  నాతనినృత్యము
భవునినాట్యముచూడ  భయము గొలుపె

ఆ !  కలియుగమిదియనుచు  కలవరపడగను
అంత్యకాలభయము  నవనిజుట్టె
భక్తితోడజనులు  భగవానుగొలచిరి
యిలనుగాచువాడు  నీశుడనుచు !
          తరణికంటి సూర్యలక్ష్మి.
                       ----------
6
[27/02, 8:10 pm] Korada: అంశం :-  🔥శివరాత్రి 🔥
   కోరాడ నరసింహా రావు 
 🙏ఓం నమః శివాయ 🙏
       🙏🌷🙏🌷🙏
త్రిగుణా తీతుడీ  త్రినేత్రుడు 
నందివాహనుడు,గంగాధరుడు
అడిగినంతనే వరములనొసగే  
బోళా శంకరుడు.... !

సంగీత, సాహిత్య, నాట్య 
సమన్వితుడీ గౌరీ శంకరుడు, 
నిరంతర ధ్యానయోగి,చంద్రమౌ ళి,లయకరుడీఓంకారేశ్వరుడు!

ఎవరుగొప్పని పోరుసలిపిన 
బ్రహ్మ, విష్ణుల పొగరు ననచగ  
విశ్వ మంతా విస్తరించిన తన 
లింగరూపమునకాద్యంతములు తెలిసికొమ్మని పరీక్ష పెట్టి, 
వారితప్పును తెలియ జెప్పిన 
మహేశ్వరుoడితఁడు.... !!

క్షీరసాగర మధనమున  ఉద్భవించిన కాలకూటమును
గళముననుంచి జగతి రక్షించి 
గరళకంఠుడే  అయినాడు  !

క్షీర, నీరముల సమవర్తి... 
   సతికి తనువున సగ భాగ మిచ్చి, సమతను చాటిన... 
ప్రియమూర్తీ... !!హరోంహరా హర... హర, హర, హర, హర 
శంభో శంకర మహాదేవా... !
నమః శివాయ-నమః శివాయ ! 
శివాయనమఓంనమఃశివాయ!
        *******************
7
[27/02, 8:20 pm] అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: కవితాగానం ...సీజన్..2....ఆధ్వర్యంలో.. శివరాత్రి సందర్బంగా
తేదీ....27.2.22
అంశం:-శివలీలలు
..............................
శీర్షిక:-
సంపత్కారకుడు శివుడు
.................................
సృష్టి,స్థితి, లయ కర్తలయిన త్రిమూర్తులలో శివుడు లయకారకుడు
శివాజ్ఞ లేనిదే చీమ ఆయిన కుట్టదు .
మార్కండేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించిన ప్రాణప్రదాత
అడిగిన వెంటనే వరాలు ఇచ్చే మహానుభావుడు.....!!

ప్రమద గణాలచే నిత్యం ఆరాధింప బడే మహిమాన్వితుడు.
గ్రహాలన్ని శివుని ఆధీనంలో ఉంటాయి అందుకే శివారాధన అత్యంత శ్రేయస్కరం.
నమః శంభవేచ మయోభవేచ, నమః శంకరాయచ మయస్కరాయచ నమఃశివాయచ శివతరయాచ అని  నారికేళ జలంతో శివుని అభిషేకం సర్వ శుభకరం...!!

సగరపుత్రుల సద్గతికై భగీరథుని తపస్సుమెచ్చి
పరమ పవిత్రమైన గంగ ను మనకందించిన లోకోద్దారకుడు
మోక్షానికి కారణమైన  తారకమంత్రం
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 
మనకందించి మానవ జీవితాలను ఉద్ధరించిన పరమాత్ముడు....!!

ఆదిశంకరులకు చండాలుని రూపంలో దర్శనమిచ్చి, అహంకారాన్ని పోగొట్టి కులమత భేదాలు లేవని జీవులందరు పరమాత్మ స్వరూపాలే అని ఆత్మజ్ఞానాన్ని ,అమరత్వాన్ని  ప్రసాదించిన  పుణ్యమూర్తి.                     ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రమే పాపాలను పారద్రోలు 
లోక కళ్యాణార్ధం హాలహలం ను గరళం లోనే ఉంచుకొన్న కారుణ్యమూర్తి
ఎన్నని చెప్పను, ఏమని చెప్పను శివలీలలు వర్ణింప తరమా?
అందుకే జగతిన శివుడు సంపత్కారకుడు.....!!
    లోకా సమస్తా సుఖినో భవంతు.
................................
పేరు:-          
కవిమిత్ర, సాహిత్యరత్న
అయ్యలసోమయాజుల ప్రసాద్ 
రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి
విశాఖపట్నం.
చరవాణి:-9963265762          
.................................హామీపత్రం:-
ఇది నా స్వీయకవిత అనువాదం కాదు.
అయ్యలసోమయాజుల ప్రసాద్
.................................
8
[27/02, 8:21 pm] +91 90594 38068: అంశం: శివరాత్రి 
శీర్షిక: నీలకంఠుడు 
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
కాజీపేట 
...
లోక కళ్యాణం కోసం 
గరళాన్ని గళంలో బంధించిన 
ప్రేమమూర్తి 
నీలకంఠుడు 

రాక్షసులకు సైతం 
వరాలను ప్రసాదించే 
భోళాశంకరుడు 

ఆ స్వామి త్రినేత్రుడు 
త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు 
త్రిజన్మ పాప సంహారుడు 
త్రిలోక నాయకుడు 
త్రిదళాలతో కూడిన 
బిళ్వపత్రాలను ఇష్టపడే 
అల్పసంతోషి 
అర్థనారీశ్వరుడు 

దేవతలకు దైవం 
నియమాతీతుడు
నిత్యనూతనుడు 
సనాతనుడు 

అందరూ ఆరాధించే దైవం శివుడు 
ఆబాల గోపాలాన్ని 
ఆకట్టుకునేది శివతత్వం 
...
హామీ పత్రం 
..
ఈ కవిత నా స్వంత  రచన
9
[27/02, 8:24 pm] Gorrepati Srinu Garu Poet: కవితా గానం
అంశం : శివుడు
శీర్షిక :  లయకారుడు

రచన : గొర్రెపాటి శ్రీను  


శివుడు..ఆద్యంతరహితుడు !
శివుడు..పార్వతి దేవి కి సగం తనువు నిచ్చి
అర్ధనారీశ్వర తత్వానికి ..ఆలుమగల అనుబంధానికి.. ప్రతీక తానయ్యాడు !
శివుడు..లయకారుడు !
శివుడు..భక్తసులభుడు !
  దేవదానవులు జరిపిన సాగరమధనంలో
  ఉద్భవించిన హాలాహలం ముల్లోకాలను ముంచెంత్తబోతుంటే
  కాలకూట విషాన్ని కంఠాన దాచి..
  లోకాలని కాపాడిన మహోన్నతుడు ..శివుడు ! 
"శివ" నామ స్మరణలతో
కొలిచే భక్తుల
సర్వపాపాలను హరింపజేసి
జనులకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే మహిమాన్వితుడు..శివుడు !
"శివరాత్రి" పండుగ నాడు
ఉపవాస దీక్ష ను అవలంబించి
జాగరణ చేస్తే..కరుణించి సదా కాపాడే..
కారుణ్యమూర్తి ..పరమశివుడు !
  "ఓం నమః శివాయ"
   పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తే చాలు
   హృదయంలో కొలువై ఉండి
   కోరిన కోర్కెలు తీరుస్తూ..
   అనుగ్రహించే ..భోళాశంకరుడు..సదాశివుడు ! 
శివుడు..శుభకరుడు !
శివుడు..సన్మార్గ దర్శకుడు !.

                                                   - గొర్రెపాటి శ్రీను
10.
ఈశ్వరా.... పరమేశ్వరా....
------------------------------ 
శివాజ్ఞ లేనిదే
చీమైనా కుట్టదు
అంటారే మరి ఏమయ్యా 
ఈశ్వరా
జనుల మధ్య ఈ ఈర్ష్యాసూయలేల?
ఓ విరూపాక్షా!
ప్రజలు తమ వికృత చేష్టలతో 
ప్రకృతిని ధ్వంసం చేసి విలయం సృష్టిస్తుంటే
వింతగా చూస్తున్నావేల శంకరా!
మూర్ఖపు ఆలోచనలతో
మొండి వైఖరులతో  
మారణహోమం చేస్తుంటే 
మౌనం దాల్చావేమి మహాదేవా? 
తరులు,గిరులు
నదీనదాలు
సముద్ర గర్భాన్ని, సాగర తీరాలను 
చివరకు 
నీ నివాసమైన కైలాస పర్వతాలను కూడా
తమ స్వార్ధ ప్రయోజనాల కై 
కైంకర్యం చేస్తుంటే
ఏల భరిస్తున్నావు కేదారేశ్వరా
 ఓ త్రినేత్ర ధారీ! త్రిశూల పాణీ!
జనులు ఆజన్మాంతం త్రికరణశుద్ధిగా జీవించునటుల
ప్రకృతిమాతతో  సుసాన్నిహిత్యంగా మెలుగునటుల
చేయగ భువికి రావా భవాయా
మహేశ్వరా మముకావగ రావా....
••••••••••••••••••••••••••••••••••
టేకుమళ్ళ విజయ లలిత
ఉపాధ్యాయిని
11.
[28/02, 7:17 am] +91 98710 96566: కవితాగానం (సీజన్2)
పేరు : డా.కమలాదేవి
తేది : 28-2-22
అంశం : శివుడు
కవిత :
శీర్షిక : లింగార్చన
బ్రహ్మాది దేవతలచే అర్చింప
బడులింగం
స్వచ్చంగ ప్రకాశించు లింగం
జన్మతః కలిగిన దుఃఖాన్ని 
పోగొట్టే లింగం
దేవతలు మునులచే పూజింపబడు లింగం
పరిమళ గంధంచే ఒప్పు లింగం
బుద్ధి ని పెంపొందించు లింగం
సిద్ధులు దేవతలు  రాక్షసులచే నమస్కరింపబడు లింగం
సువర్ణాభరణాలచే అలరారు లింగం
సర్పము చుట్టబడిన లింగం
దక్షయజ్ఞవినాశకమైన లింగం
పసుపు కుంకుమ లనలదిన
లింగం
పద్మములహారములతో నొప్పు లింగం
పాపమును నశింపచేయు
లింగం
దేవతాగణముచే కొలువబడు లింగం
కోటిసూర్యకిరణాలలా ప్రకాశించు లింగం
అష్ట దరిద్రాలను తొలగించు
లింగం
దేవగురువులు దేవతాశ్రేష్ఠులచే పూజింపబడు లింగం
నందనవన పుష్పాలచే
అర్చింపబడు లింగం
పరమపదమైనది
పరమాత్మ స్వరూపము
అయిన శివలింగానికి
నానమస్కారము
భక్తి ప్రపత్తులతో
ఈలింగాష్టకాన్ని
చదివిన వారికి 
కలుగుతుంది శివలోకం
శివసాయుజ్యం
(లింగాష్టకానికి స్వేచ్ఛాను
వాదం)
12/2
[28/02, 7:29 am] Korada: అంశం  :🙏మహాశివరాత్రి 🙏
    కోరాడ నరసింహా రావు 
  హర - హర మమ్ము గావరా !
        *****************
సృష్టి పదార్థమే నీవు... 
    చైతన్య శక్తి తో కూడి... 
       అర్ధనారీశుడైనావు !

పులిచర్మమే వలువగా మొలకు 
చుట్టుకుని..., కరమున కపాల భిక్షా పాత్రతో,గంగిరెద్దునెక్కి... 
స్మశానమే నీ విహార స్థలిగా... 
సంచరిoచుతావు... !

సూర్య,చంద్రులే రెండు కళ్ళు గా...ఫాల భాగమున జ్ఞాన నేత్రముతో... త్రికాలములు త్రిసూలముకాగా,ధ్యానముద్రలో  నిత్య యోగివయ్యా... !

గలమున గరళము, శిరమున గంగ.. నెత్తిన నెలవంక, కాల నాగులే ఆభరణములు... నీ లీలలెరుగ గలమా... !!

సృష్టి, స్థితులను సమవర్తించిన 
త్రిగుణాతీత... లయకారుడవె నీవు ! అందెల రవళి,శంఖనాద ము,ఢమరుకధ్వనులేసాహిత్య
సంగీత,నటనాభినయములయ్య... !
ఈశ్వరా... మహేశ్వరా... పర మేశ్వరా... ! హర -  హర మహా దేవ, మమ్ముగావుమయ్యా !!
13.
[28/02, 9:37 am] +64 21 233 1334: శీర్షిక శివుడు
డా. తంగిరాల నాగ లక్ష్మి

 శివుడనునది
 నామమా రూపమా
 శుభమా పదమా పరమ పథమా
లేక   అక్షర సమూహమా  అక్షరమా (క్షరముకానిదా)
శివ నామము ఇచ్చు సర్వము
రూపముండిన యే కదా
నామ ముండును
నామము  జపము చేసిన ఆ నామి అగుపడును
నామ సముదాయములనంతము
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర శివంకరుడు
శంభో మహా దేవ శివ శంభో
శివాయ గురవే నమః
శివాయ శుభం కురుకురు
నమః శివాయ
సిద్ధులలో  సర్వో త్క్రుష్ట సిద్దుడు
ఈశానుడు ఈశ్వరుడు
దేవతా సమూహంలో దేవాది దేవుడు
మహా దేవుడు
సర్వేశ్వరుడు సదా శివుడు 
అర్ధనారీశ్వరుడు శివుడు
సర్వ విద్యల నొసగు
దక్షిణామూర్తి శివమూర్తి
సహస్ర నామాలుగా సహస్రరూపాలుగా
 భాసిల్లు పరమాత్మ  పరమ శివుడు
సత్యానంద మయుడు
జ్ఞాన తత్వము తో ప్రకాశించు
చిదానంద రూపుడు శివుడు
కాల గమనాన్ని నియంత్రించే కాలభైరవ
స్వరూపం  మహా కాళేశ్వరుడు
అష్ట మూర్తి తత్వ రూపుడు శివుడు   ఏకాదశ రుద్రులుగా
అష్ట  భైరవులుగ అభయంకరునిగా
హరి వల్లభునిగా హరి హరుని గా
అవతరించిన ఆదిదేవుడు శివుడు
సూర్య చంద్రాగ్నులను నేత్రములుగా కలవాడు త్రినేత్రుడు త్రిశూల ధారి
త్రిపురములను త్రిపురాసురులను
జయించిన త్రిపురాంతకుడు శివుడు
గరళమును గళమున  గైకొనిన
నీలకంఠుడు  శివుడు
నిరాకారమునుండి సాకారముగా సంకల్ప మాత్రమున విస్తరించిన నిర్గుణ పరబ్రహ్మ  నిరంజన నిరీశ్వరుడు శివుడు
ప్రకృతిలోని ప్రాణుల పోషించు
పంచ తత్వాత్మకుడు పరమేశ్వరుడు
ప్రళయము సంభవింప చేయు ప్రళయ రుద్రుడు శివుడు
సృష్టి స్థితి లయ.తిరోధాన  అనుగ్రహ 
కృత్యములు నిర్వహించు 
పరమేశ్వరీ సహిత
 పంచముఖ పరాత్పరుడే శివుడు
14
[28/02, 10:03 am] Muddu Venkata Laxmi పిఠాపురం కవయిత్రి: కవితా గానం సీజన్ 2
28-02-2022
ముద్దు వెంకటలక్ష్మి
అంశం : శివరాత్రి సందర్భంగా
            కవితలు
 శీర్షిక :  చిదానందునికి
             షోడశోపచార పూజ

శివరాత్రి జాగరణం
క్షణక్షణం శివనామ స్మరణం
అర్ధనారీశ్వరునికి
మనఃపూర్వక *ఆహ్వానం*
హృదయమే *రత్నసింహాసనం* ;

పరమేశ్వరునికి *పాద్యం*
త్రిశూలహస్తునికి *అర్ఘ్యం*
శుద్ధాంతరంగునికి
శుద్ధ *ఆచమనీయం*
పంచారామ నివాసునికి
*పంచామృత స్నానం*
చిదానంద స్వరూపునికి
తదేకదీక్షతో *శుద్ధోదక  అభిషేకం* ;

గజచర్మధారికి *అక్షరవస్త్రయుగ్మం*
యజ్ఞస్వరూపునికి
*యజ్ఞోపవీత సమర్పణం*
ముక్కంటి దేవరకు
*చందన సమర్చనం*
ప్రణవస్వరూపునికి
*పవిత్రాక్షతల సమర్పణం* ;

విబూదిరాయునికి
మారేడు దళాల,
*జిల్లేడుపూల అర్చనం*
కైలాసవాసికి 
*ధూపకైంకర్యం*
జ్ఞానస్వరూపునికి
*దీప ప్రజ్జ్వలనం*
మానస సరోవర విహారికి
కందమూల, ఫలాల
*నివేదనం* ;

నిగమతత్త్వజ్ఞునికి
*మంగళనీరాజనం* ;

సత్వరప్రసన్నునికి
కవితా మంత్రపుష్పం,
ఆత్మజ్ఞాన ప్రదాతకు
ఆత్మప్రదక్షిణ నమస్కారం,
తదనంతరం చిదానందరూప ప్రసాద
స్వీకరణం.
15./2
28-02-2022
అంశం : శివరాత్రి సందర్భంగా కవితలు
ముద్దు వెంకటలక్ష్మి
ఊరు : పిఠాపురం
శీర్షిక : శివుడు పార్వతి కేమి
          చెప్పునో!


పార్వతీ పరమేశ్వరులు పరస్పర అవగాహనకు, అన్యోన్యతకూ
ఆదర్శ దంపతులు,
లోక కళ్యాణ కాంక్షాపరులు ;
జగదీశ్వరుడు జగన్మాతకు ప్రబోధించు నెపముతో నరులకెన్నో
విషయములు వివరించుచుండు ;
స్తోత్రముల ఫలములనూ, వ్రతకథలనూ వినిపించుచుండు ;
ప్రకృతము జగమంతా ప్రసరించుచున్న శివరాత్రి శోభలను,
భక్తుల కథలనూ విశదీకరించుచూ

ఆమెకు మనోల్లాసమును కలిగించుచున్నాడేమో!
16
 కవితా గానం సీజన్ 2
28.2.22 .. సోమవారం
అంశం:: శివరాత్రి సందర్భంగా
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు :: కర్నూలు

నీవు ఉండేది మరుభూమి
కానీ నీవే అంతర్యామి
వలువేమో గజచర్మము
తెలుసుకోలేము నీ మర్మము
చేతిలో ఆయుధము త్రిశూలం
సత్వ రజో తామస గుణ ప్రతిరూపం
ఒళ్ళంతా విభూది
ప్రతి ఒక్కరు బూడిద అవుతారు నిజమది
మేడలో నాగాభరణము
అపమృత్యునివారణము
నీలకంఠ నామము
ఆగే నక్కడే గరళము
శిరస్సుపై గంగ
విషము చల్లబడు ననంగ
జటాజూటముపై నెలవంక
తీర్చేవు భక్తుల శంక
లలాటముపై నేత్రము
త్రికాల జ్ఞాన పత్రము
అర్దనారీశ్వరము
భార్యభర్తల అనురాగబంధం
సర్పానికి కేకికి పడదు
అయినా నీ చెంత గొడవ కుదరదు 
నందికి సింహామంటే భయం
అయినా నీ దగ్గర చూపు నెయ్యం 
కాసి0త జలము అభిషేకిస్తే
పరవశించి కొరినదేదైన ఇచ్చే
భోలాశంకరుడవు
నాట్యభంగిమల నటరాజువు
శివతాండవ చిద్విలాసుడవు
చిదానంద లయకారుడవు
నమ్ముకున్నవారికి కొంగుబంగారం
శివా అంటే ఆదుకునే దయాలువు
భక్త సులబుడవు
కర్తవ్య నిర్వాహకుడవు!!
   పై కవిత నా స్వంత రచన అని హామీ
17
28/02/2022 సోమవారం 
అంశం: మహా శివరాత్రి
జోషిపద్మావతి మహబూబ్ నగర్ 
*శీర్షిక: లింగాకారా! కావగరారా!! 
************************************
నందివాహనా నాగభూషణా
భోళాశంకరా గౌరీరమణా
త్రినేత్రుడవై,త్రిగుణాత్మకుడవై
పృథివినే రథముగా విధినే సారథిగా
వేదాలనే అశ్వములుగానియమించి 
రవిచంద్రులనే రథచక్రాలుగజేసి
త్రిపురాసురునే అంతంజేసి త్త్రిశూలధారుడవని త్రిపురాంతకుడవని
లోకాలనే కాపాడిన లోకేశుడవని.
త్రిమూర్తులలో లింగాకారుడవై
జగతికి వెలుగును పంచిన జ్యోతిస్వరూపుడవైన జగదీశ్వరా! 
క్షీరసాగరమథనమందున ప్రభవించిన గరళము మింగి గరళకంఠుడవై
తాపము తీర్చ గంగశిరమునెక్క గంగాధరుఠవై
చలువను పంచగ శశి జఠయందునిలువ శశిధరుడవై
అభిషేకముతో హాయినిపొందే అభిషేక ప్రియుడవై
అభయమిచ్చిన జంగమా!
లింగోధ్భవకాలమే శివరాత్రి జాగారమాయె.
శంభోశంకర సాంబ సదాశివా!
కావగరారా! కలికల్మషహరా!!
               -------------------
18
28/2/2022 సోమవారం 
అంశం..మహాశివరాత్రి 
శీర్షిక..ఓం నమః శివాయ 
తాతపూడి సోమశేఖర శర్మ
యానాం,8328079336

శివశివ శంకర నమోనమో
             హరహర శంకర నమోనమో
భవభవ శంకర నమోనమో
             ధిమిధిమిశంకర నమోనమో

నాగేశ్వరాయ నమోనమో
             నాగశేఖరాయ నమోనమో
నందీశ్వరాయ నమోనమో
            నాగభూషణాయ నమోనమో

త్రయంబకాయ నమోనమో
         త్రిపురాంతకాయ నమోనమో
త్రినేత్రధారి నమోనమో
             త్రిశూలధారి నమోనమో

మహాలింగాయ నమోనమో
           మహాదేవాయ నమోనమో
మహేశ్వరాయ నమోనమో
          మణిమేఖలాయ నమోనమో

చండీశ్వరాయ నమోనమో
            చంద్రశేఖరాయ నమోనమో
చెన్నకేశ్వరాయ నమోనమో
             చిన్మయరూపా నమోనమో

సోమేశ్వరాయ నమోనమో
          సోమశేఖరాయ నమోనమో
సదాశివాయ నమోనమో
          సాంబసదాశివ నమోనమో

విశ్వంభరాయ నమోనమో
           విశ్వనాధాయ నమోనమో
విమలేశ్వరప్రభు నమోనమో
            వీరభధ్రీశ్వర నమోనమో

భష్మభూషణాయ నమోనమో
           భక్తవత్సలాయ నమోనమో
భీమేశ్వరాయ నమోనమో
           భీమలింగాయ నమోనమో

ఓం నమఃశివాయ... ఓం నమః శివాయ 
శివోహం.....శివోహం...... శివోహం.....

హామీపత్రం
ఈ కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,8328079336
19/2
మహా శివరాత్రి శుభాకాంక్షలు
డా.నాగలక్ష్మి తంగిరాల 
మహాశివరాత్రి  కవిత 2

శుభము ప్రసాదించే రాత్రి
మహాశివరాత్రి 
మాఘ మాసమున అఘంబు తొలిగించు రాత్రి మహా శివరాత్రి
సంవత్సరమునకొక్కసారి వచ్చే రాత్రి
జ్ఞాన లింగమై ఉద్భవించిన రాత్రి
రాత్రి తమోగుణాన్ని సూచిస్తుంది
 భయంకరమైన 
అంధకారాన్ని సృష్టిస్తుంది
 అజ్ఞానం అంధకారం లాంటిది
చీకటిలో వెలుగు ప్రసాధించటమే
రాత్రి ఆరాధన లక్ష్యం

సత్య మై నిత్యమై అచింత్యమై సహస్ర భాను కోటి ప్రకాశమైన కాంతిపుంజము
జ్ఞానం
జ్ఞానబోధ కి పరమార్ధం బ్రహ్మము ను తెలుసు కోవటం 
బ్రహ్మమే నేనని ఎరుక లోకి రావటం
అదే అహం బ్రహ్మాస్మి అదే అద్వైతం
అర్ధరాత్రి లింగోద్భవం జ్ఞానద్వీపోద్భవం
జన్మలో ఒక సారి యిలా చేయ గలిగితే
శివ రాత్రి జాగారం ఉపవాసం అభిషేకం
బిల్వదళ సమర్పణ  
శివనామ స్మరణతో కైవల్య ప్రాప్తికి సదవకాశం
అందుకే అన్నారు జన్మానికో శివరాత్రి
శివరాత్రి మహిమ శివ మహిమను సంపూర్ణముగా చెప్పుట
 సాధ్యంబగునే
శివోహం శివోహం శివోహం
చిదానంద రూపం🙏🙏🙏
20
 మహాశివరాత్రి శుభాకాంక్షలతో....
🌹🪴🙏🙏🙏🌸🌻

🌸శివతాండవము జేయ నటరాజు 
మ్రోగించె
మరణమృదంగం
శివుడు తెరచిన త్రినేత్రమౌ
పరమేశ్వర లీలావిలాసం

ఫెళఫెళధ్వనులతో
ఎగిరె
సైనికుల తలలు
పాపపుణ్యం జాడ తెలియని 
యుధ్దనీతికిది యె జెండా

చిలుము వదిలెను
తుప్పుపట్టిన ఆయుధాలవి
నిదురపోయే సైన్యమంతకు
జాడ్యమొదలింది

క్షిపణులన్ని తారాజువ్వలై
మేలుకున్నవణుబాంబు మాత్రలు

జగన్నాటక రంగమందున
నాయకత్వపు
అహంకారం తలను దాటి నింగి కెగసింది

పేదతల్లికి పీడకలలో పేగు బంధం 
వీడిపోయింది.

  🌹🪴🌻🌹🙏🌻🌸🪴
మదునూరి సూర్యనారాయణ.
21
శివరాత్రి పండుగ సందర్భంగా
గజల్
రచన:--సింహాద్రి వాణి
ఊరు:--విజయవాడ
చరవాణి:--7569820872

మనసుతీర‌ వేడుకొనగ మన్నించుము సదాశివా
పాపమంత బాసిపోవ కరుణించుము సదాశివా

వల్లకాడు యిల్లేలా వదిలివెయ్యి‌ ముక్కంటీ
భక్తుల మదిమందిరాన వసియించుము సదాశివా

ఎగుడు దిగుడు కన్నులున్న సమదృష్టిని‌ చూపువాడ
కరుణామృత ధారలనూ కురిపించుము సదాశివా

దడదడమని గుండెలదిరి దుర్మార్గము హడలిపోవ
ఢమఢమమని ఢమరుకాన్ని వాయించుము‌ సదాశివా

మానవత్వ పరిమళాలు జగమంతా నిండువిధము
విజ్ఞానపు దీపాలను వెలిగించుము‌ సదాశివా

కంఠమందు దాచినాను కాలకూటవిషము నీవు
విషముచిందు‌ భావాలను‌ తొలగించుము సదాశివా

భక్తవశుడు శంకరుడూ పావనుండు సింహాద్రీ
పార్వతమ్మ ముదముచెంద  నర్తించుము సదాశివా
22
మహాశివరాత్రి శుభాకాంక్షలతో *
  🌹🌱కవితాగానం -2🌱🌹
   ..🙏🌺..శివోహం ..🌺🙏..
 
       ఓ శివా ....సదాశివా !...
     మహాదేవా ....మంగళకరా !...
   నీ నామ స్మరణే ...నాలో చైతన్యం! ....
  నీ నామమే .....నాకు అమృతబాండం! .....
  ఏడాదిలో వచ్చే ఐదు శివరాత్రుల్లో 
  పరమపవిత్రం ఈ మహాశివరాత్రి ....
  ఇది పరమేశ్వరుడి పర్వదినం 
  లింగోద్భవ తిథి ..మా చింతలను తీర్చేనది ...
  లింగాత్మకమైన నీరూపం....
  మాకు కల్గించు మహాయోగం ....
  ఓ మహదేవా నీ అరవైనాల్గు స్వరూపాలలో 
   లింగోద్భవమూర్తి అతి పవిత్రం ....
   ఓ మహదేవా నీ ఐదంచెల  అలంకరణ  
   అంతటా మాకు ప్రతీక్షణం ఆనందమయమే ....
   అగ్నిపునీతమైన విభూది నీకు ఒంటినిండా 
      ఇదేకదా ...మొదటి అలంకరణ ....
   రెండో అలంకరణ రుద్రాక్షా... 
      అదే మాకు దారిచూపే జగద్రక్ష ....
   మూడవ అలంకరణ పంచాక్షరీమంత్రం ...
      అదే పరమపదానికి సోపానం ...
   నాల్గో అలంకరణ మారేడుదళాలతో అభిషేకం..
    ఐదోఅలంకరణ నీనామస్మరణం ...
      సదా స్మరణం ...పంచాక్షరీమంత్రం ....
   ప్రదోషసమయాన నీదివ్యదర్శనం ...
     సకల ఐశ్వర్యలకు మార్గదర్శనం .....
    శివా  శివా శివా అంటే ....శివానితో పాటు 
     తలచినంతనే  నిల్చే భోళాశంకరుడు....
   ఆదిదంపతుల దర్శనభాగ్యం .....
       అమృతమయమే ఈ జన్మకు ....
   లోకాలనేలేస్వామి ....
     మమ్ము రక్షించే భారం నీదే ......
    ఓం నమః శివాయ ....
--- జక్కిడి వెంకటరెడ్డి .
23.
కవితా గానం
డా బల్లూరి ఉమాదేవి
అంశం: శివస్తుతి


1ఆ.వె:కోరికొలుచు వారి కొంగు బంగారమై

        కూర్మి తోడ దీర్చు కోర్కొలెల్ల

         సురనదిపతియితడె శూలపాణియితండె

          భస్మధారి యితడె పరమ శివుడు.


2ఆ.వె:హరహరమహదేవ యనుచు ననవరతము

         నిన్ను చేరి కొలుతు నీలకంఠ

         మామొరాలకించి మమ్మేలు మనిశము

         వేడు కొందుమయ్య విశ్వనాథ.



3ఆ.వె:పరమశివుడతండు పదుగురి వాడుగా

           గరళముంచె తాను కంఠమందు

 జనుల  భయము నుడిపి జయములొసగు చుండు

       కొలువ రండు వేగ కూర్మి తోడ.


4.ఆ.వె:తపము చేయ గిరిజ తాపహరుని గూర్చి

           కపటవటుని గానె కానుపించె

       పరమశివుడతండు పదుగురి వాడుగా

         పరిణయంబు నాడెభామ నపుడు.


5.ఆ.వె:పరమశివుడతండు పదుగురివాడుగా

           పార్థు కొసగె తాను పాశుపతము

          భక్తితోడ గొలున బలము హెచ్చుచు నుండు

           భయము నుడుపు నతడు భద్రమూర్తి.


6ఆ.వె:పరమశివుడతండు పదుగురి వాడుగా

          వరములొసగుచుండు వాసిగాను

         భోళశంకరుడని భూరిగా నుతియింప

         సర్వమొసగునట్టి సాత్త్వికుండు.


7.ఆ.వె:కరము నుంచ చావు కలుగవలెననుచు

        వరము కోరె నసుర వరుడు నాడు

       పరమశివుడతండు పదుగురి వాడుగా

         వరము నిచ్చి తాను బాధపడియె.


8ఆ.వె:కోరికొల్చువారి కొంగుబంగారము

          కామితమ్ము లొసగి కరుణచూపు

        పరమశివుడతండు పదుగురి వాడుగా

       సురనది పతి యితడె శూలధారి.


9ఆ.వె:నంది నెక్కి తిరుగు నగరాజ సుతతోడ

          సుతులిరువురు కొలువ సురలు మెచ్చ

         పరమశివుడతండు పదుగురి వాడుగా

          భస్మధారి యితడె భాగ్యమొసగు.


10.ఆ.వె:పాలకడలి యందు ప్రభవించి నట్టి యా

           విషము గళము నందు వేగ దాల్చె

          పరమశివుడతండు పదుగురివాడుగా

            వలచి పెండ్లియాడె పార్వతమ్మ.
24
: శీర్షిక..... భవ బంధాలు....
అంశం.... శివరాత్రి...01032022
****************************

పల్లవి... పార్వతీ వల్లభ పరమేశా... గిరిజా శంకర మహాదేవా
భవ బంధాలు తుంచేయిరా ...
మము భవసాగరమున ముంచేయిరా...
మహాదేవా మహాదేవా మహాదేవా

ఆది మధ్యాంత రహితుడా ఆది శంకరా
ఆత్మ పరమాత్మల అనుబంధాన్ని
ఆత్మ శోధన తోనె సాధ్యమంటావు
ఆత్మానుభూతిని పొందమంటావు

ఆత్మానుగతులైన వారికందరికి ఎనలేని ఆనందం
ఇవ్వ గలిగిన దేవ
ఆధ్యాత్మిక అమృతవాహినిలో
ఓలలాడించే భక్తవత్సల

అలవిగాని ఆనందానికి 
అవధులు లేని
కైలాసం ప్రసాదించే పురాణ పురుషా
ప్రకృతి మాత పార్వతి వల్లభ పరమేశా
ఈసును దీసి దాసుని జేయుము ఈశ్వరా

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.01032022
25.
కవితా గానం(సీజన్2).        1--3--2022.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- మహా శివరాత్రి.
1. తే.గీ.
భవునికిన్ పార్వతికిని వివాహమైన
రాత్రినే పిలుతురు శివరాత్రి యనుచు
వీరికి మునుపు... పెండ్లైన వారు లేరు
కనుకనే యాదిదంపతు లనుచు వీరు
వినుతి కెక్క కల్యాణము విశ్వమంత
పర్వ దినముగ నేటికిన్ వాసికెక్కె. 

2. తే.గీ.
బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాద
మెవరు గొప్పనుచు జరుగ శివుడు నుద్భ
వమ్ము నొంది తేజోలింగ ప్రాభవముగ
జ్ఞానముపదేశమున్ జేసెగా నలువకు
హరికి శివరాత్రి రోజునే; యర్ధరాత్రి
లింగ ముద్భవమైన కాలంగ తలచి
యర్ధరాత్రి యర్చనలు నాచారమయ్యె. 

3. తే.గీ.
శివుడి కిష్టమైనది యభిషేకము గద
యెన్ని యభిషేక ప్రక్రియలున్న గాని
యన్నిట జలాభిషేకమ్ము ననగ భవుని 
కి కడు ప్రీతి, జలము విష్ణువె  కనుక గద.
26.కవితాగానం-2
పేరు: ఎన్.నరేశ్ చారి

హే.. భోళా శంకరా.....
*************************
నీ పేరొక్కటి తలవలేరేమో కానీ
ప్రతిరోజూ వాళ్ళకు ఉపవాసదీక్షలే
నీ గుళ్ళోకివెళ్లి భజనలు చేయలేరేమో కానీ
ప్రతిరోజూ వాళ్ళకు శివరాత్రి జాగారాలే
నిన్ను చుసారో లేదో తెలియదు కానీ
అర్ధనగ్నదేహాలతో అచ్చం నీకులాగే...

భిక్షా పాత్ర చేతిలో పట్టుకొని 
బస్టాండ్ల చుట్టూ  ప్రదక్షిణలు చేసినా
కరుణించని ప్రయాణిక దేవుళ్లుంటే పస్తులే
ఏ గుడిమెట్లదగ్గర కూర్చున్నా
ఏ చర్చి గేట్లవద్ద కూర్చున్నా
వాళ్ళ బతుకు ఒక్కమెట్టూ పైకెక్కలేదు
వాళ్ళ జీవితం ఒక్క వసంతాన్నీ చూడలేదు

హే..భోళా శంకరా...
కాలం కాటుకు రోడ్డునపడ్డ జీవితాలు వారివి
కన్నీళ్ళతో కడుపునింపుకుంటున్న దేహాలు వాళ్ళవి
ఖరీదైన కైవల్య ప్రాప్తికై
వాళ్లు నీకు పట్టువస్త్రాలు బహూకరించలేరు
పంచామృతాలతో అభిషేకించనూలేరు
సుందరమైన పదాలతో  కీర్తించనూలేరు
వాళ్ళకు తెలిసిందల్లా ఒక్కటే
నిన్ను దర్శించడానికొస్తున్నవారిలో నిన్ను చూసుకోవడమే
సృష్టి లయకారుడివి 
వాళ్ళను కూడా కాస్త నీలో లయించుకో స్వామీ!

                            - Naresh Chary@369.
                                  Dt:01-03-2022
27.

కవితా గానం సీజన్ 2
01-03-2022
ముద్దు వెంకటలక్ష్మి
శివరాత్రి కవితలు (3)

సదాశివా! చిదానంద రూపా!
సానుకూల దృష్టిని ప్రసాదించుమయ్యా!
సమస్యల్లో చిరునవ్వు నవ్వగలుగు
శక్తి నీయవయా!

గరళకంఠా! గజచర్మ ధారీ!
పరోపకార గుణమును మాకు కలిగించుమయా! 

చంద్రశేఖరా! గంగాధరా!
కరడు గట్టుచున్న మా మనస్సుల్లో
కరుణరసము నింపవా?!

కందర్ప హరా! చిన్మయ స్వరూపా!
అరిషడ్వర్గములను జయించు
నిశ్చల ధ్యాన నిమగ్నా!
రక్షింపుము దేవదేవా!
మమ్ములను ప్రక్కచూపుల నుండి ;

కైలాస వాసా! కారుణ్య మూర్తీ!
కైవల్య కాంక్షను కలిగించుమోయీ
స్థితప్రజ్ఞతను అనుగ్రహించుమా.
28.
[01/03, 11:54 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్‌ 2 )1/3/2022/ మంగళ వారము
శివరాత్రి సందర్భంగా
'శివస్థుతి '

ఈశుచింతచేయ యిడుములన్ని తొలగు
ఇలలోనిదైవము ఈశుడనగ
హరుని సేవించిన హరియించుపాపాలు
భక్తితోగొలచిన ముక్తిదొరకు
నిర్మలమనసుతో నీలకంఠు నారాదించు చింతలన్ని తీరు
శివమహిత్యకథలు చదివినచాలును చీకుచింతలుండవు
పుణ్యకథలువినగ పుణ్యముచేరును
పాపములన్నియు పారిపోవు
అంతరంగమున హరహరశ్మరణ
అంత్యకాలభయము అంతమగును
శివునియానతిలేక చీమైనకుట్టదు
ఆపదలన్ని నాగిపోవు
మృత్యుభయముతీరు మృత్యుంజయ మంత్రము
శంభుని తలచిన శంకలుతీరును
శంభుడు సంపదలనొసగును
ఏసమయమైన నెప్పుడైన ఈశునామముదలచిన యిహపరములనొసగును
ఈతిబాధలన్ని ఈశుడు తొలగించు
ఇలనుగాచువాడు ఈసుడేను
పరమశివరాత్రి పరమేశుసేవింపుము
అభయమొసగి ఆశీర్వదించు !
     తరణికంటి సూర్యలక్ష్మి.
                  ---------
29
[02/03, 3:40 am] +91 94236 90615: కవితా గానం ( సీజన్ 2)
అంశం:- శివరాత్రి
శీర్షిక:- సహజ సుందరుడు
*************************
ఎంత చక్కందనమో
శివ సుందరునిదీ
ముస్తాబులే వద్దు
సహజ సుందరుడు

ఒక కంట దినమణి
వెలుగులను పంచ
వేరొక కంట జాబిలి
వెన్నెలలు‌ కురియ
బేసి కన్నున అగ్ని
కీలలే‌ ఎగయ

తలనున్న గంగమ్మ
కులుకు లొలికించ
సిగపూవు నెలవంక
జిలుగులను పంచ
విస పురుగులే నగలు
మిసిమి చూపించ

గిరిజార్థ దేహమై
తనువు రంజిల్ల
గరళమ్ము కంఠమున
నీలమణి కాగా
దిక్కులే వసములు
పట్టు పుట్టములు

మెయి పూతలై‌ బూది
గంధాలు విరియ
భూత ప్రేతమ్మలే
సహవాసు లవగ
బసవన్నపై‌ నెక్కి
లోకమ్ము లేలు.

🖋️ వేదాంతం సురేశ్ బాబు
     ‌ చంద్రపూర్
     మహారాష్ట్ర
30/3
అంశం: మహా శివరాత్రి శివాను గ్రహం
డా. తంగిరాల నాగ లక్ష్మి
కవిత 3

శ్రీక రంబు పలుక శివశివయనుచును
శివుని గురువుగా నెంచుము చిత్తమందు
చిద్విలాస చిదానంద చివరికి దరి
చేర్చి నొసగు కైవల్యంబు శివపథంబు 

శివరాత్రి వ్రతము వలన
శివుడు జ్ఞానము నొసగును చింత వలదురా
శివ నామ జపము చేసిన
శివలోకముచేరియచట సిద్ధినిపొందున్

జగతిని నడిపించుఘనుడు
అగణిత గుణసంపద కల హరిహర దేవున్
పొగడగ వశమే మనుజుల
జగమున నామ జపమే వి జయమునొసంగున్

సంచిత పాపములు తొలగు
వంచన లేక శివభక్తి పరులకు నీశా
మంచి తనమున మెలగుచు
సంచలనము లేక నెపుడు భక్తిగ కొలవన్
**************************************
      *****************
***********
శివ తత్త్వం  తెలుసుకునే యోగ్యత కలిగిన ప్రతి ఒక్కరికీ
కృతజ్ఞతలతో ... వీరా గుడిపల్లి

Comments

Popular posts from this blog

శ్రీ కేశరాజు ప్రభాకర్ రావు గారి తండ్రి గారి జ్ఞాపకార్థం

పుష్య మాసం పౌర్ణమి 2022

నిరాడంబరత ౨౦౨౧